Hyderabad : హైదరాబాద్ గాలిలో స్లో పాయిజన్..రోజుకు 28 వేల కిలోల విషవాయువు విడుదల..వణికిస్తున్న నివేదిక

హైదరాబాద్ గాలిలో స్లో పాయిజన్..రోజుకు 28 వేల కిలోల విషవాయువు విడుదల..వణికిస్తున్న నివేదిక

Update: 2026-02-02 01:00 GMT

Hyderabad : హైదరాబాద్ అంటే ఒకప్పుడు చల్లని గాలి, అందమైన చెరువులు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు నగరం రంగు మారుతోంది. మనం పీల్చే గాలిలో మనకు తెలియకుండానే ఒక సైలెంట్ కిల్లర్ ప్రవేశించింది. రంగు ఉండదు, వాసన రాదు.. కానీ ప్రతి ఊపిరితో మన ఊపిరితిత్తులను ఛిద్రం చేస్తోంది. అదే సల్ఫర్ డయాక్సైడ్. భాగ్యనగరం ఇప్పుడు కేవలం ట్రాఫిక్ జామ్‌లకే కాదు, ఊపిరి తీసుకోలేని కాలుష్యానికి కూడా అడ్డాగా మారుతోందని ఐఐటీ కాన్పూర్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది.

హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. ఆకాశ హర్మ్యాలు, ఐటీ కంపెనీలు, మెరుస్తున్న రోడ్లు.. ఇదంతా ఒక వైపు అయితే, వీటన్నింటి వెనుక ఒక భయంకరమైన ఆరోగ్య సంక్షోభం పొంచి ఉంది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఐఐటీ కాన్పూర్ చేసిన తాజా అధ్యయనం ప్రకారం, హైదరాబాద్ గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ మోతాదు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇది కేవలం పొగ కాదు, మన శరీరంలోకి ప్రవేశించి నెమ్మదిగా ప్రాణాలు తీసే విషం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ పరిసరాల్లో ఈ కాలుష్యం అత్యంత తీవ్రంగా ఉంది.ఈ అధ్యయనంలో తేలిన లెక్కలు వింటే గుండె ఆగిపోతుంది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ORR పరిధిలో రోజుకు సగటున 18,101 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ గాలిలోకి చేరుతోంది. అదే సమయంలో నగర కేంద్రమైన GHMC పరిధిలో రోజుకు 10,701 కిలోల సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతోంది. అంటే రోజువారీగా మొత్తం నగరంపై దాదాపు 28 వేల కిలోల విషం కమ్ముకుంటోంది. ఇందులో విచిత్రం ఏమిటంటే.. నగర లోపల కాలుష్యానికి 91 శాతం కారణం మనం వాడే వాహనాల పొగ అయితే, నగర శివార్లలో కాలుష్యానికి 92 శాతం కారణం అక్కడ ఉండే పరిశ్రమలు. అంటే నగరం లోపలైనా, బయటైనా మన ఊపిరితిత్తులకు రక్షణ లేకుండా పోయింది.

సల్ఫర్ డయాక్సైడ్ అనేది డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలు మండటం వల్ల వస్తుంది. ఇది శరీరంలోకి వెళ్ళినప్పుడు శ్వాసనాళాల్లో మంటను కలిగిస్తుంది, దీనివల్ల ఆస్థమా, బ్రోన్కైటిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధులపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. కాలుష్యం ఇలాగే పెరిగితే భవిష్యత్తులో ఆక్సిజన్ మాస్కులు వేసుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, ఈ వాయువు వర్షం నీటితో కలిసినప్పుడు ఆమ్ల వర్షం కురిసే అవకాశం ఉంది, ఇది నేలను, పంటలను నాశనం చేస్తుంది.

ప్రభుత్వం ఈ పరిస్థితిని అరికట్టేందుకు చర్యలు ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 40 కొత్త రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. త్వరలో ప్రజలు గాలి నాణ్యతను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఎయిర్ క్వాలిటీ డ్యాష్‌బోర్డ్స్ తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. కాలుష్య కారక పరిశ్రమలను నగరం నుంచి దూరంగా తరలించడం, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం వంటి క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అమల్లోకి రానుంది. అయితే ప్రభుత్వ ప్రయత్నాలు ఒక ఎత్తయితే, పౌరులుగా మనం కూడా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వాములు కాకపోతే.. హైదరాబాద్ ఒక విషాద నగరంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News