Honey Trap: మెట్‌పల్లిలో హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు.. నగ్న వీడియోలతో బెదిరించి లక్షలు వసూలు
Honey Trap Gang Busted in Metpally: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ధనవంతులను టార్గెట్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను పోలీసులు ఛేదించారు.
Honey Trap: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ధనవంతులను టార్గెట్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్న హనీ ట్రాప్ ముఠాను పోలీసులు ఛేదించారు. మహిళలతో వల వేసి, ఏకాంతంలో ఉన్న సమయంలో వీడియోలు తీసి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రౌడీ షీటర్ కోరుట్ల రాజ్‌కుమార్ అలియాస్ రాజుతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మెట్‌పల్లి దుబ్బవాడకు చెందిన రాజుపై గతంలోనే పలు కేసులు నమోదయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో భర్తకు దూరంగా ఉంటున్న బలుమూరి స్వప్న అనే మహిళతో కలిసి ముఠాను ఏర్పాటు చేశాడు. బట్టు రాజశేఖర్, సుంకిటి వినోద్, పులి అరుణ్, మాగని దేవా నర్సయ్యలతో కలిసి ఒక ముఠాగా మారి నేరాలకు పాల్పడ్డారు.
హనుమాన్ నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకుని, మహిళల పట్ల బలహీనత ఉన్న వ్యక్తుల ఫోన్ నంబర్లు సేకరించారు. స్వప్న ఫోన్ ద్వారా వారిని ఆకర్షించి గదికి రప్పించేది. బాధితులు గదిలోకి వెళ్లిన తర్వాత మిగతా సభ్యులు అకస్మాత్తుగా లోపలికి వెళ్లి వీడియోలు తీసేవారు. వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి లక్షల రూపాయలు వసూలు చేసేవారు. ఇప్పటికే పలువురు బాధితులను బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది.
డిసెంబర్ 28న మెట్‌పల్లికి చెందిన ఒక వ్యాపారిని టార్గెట్ చేసి 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. విషయం బయటకు రాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ముఠా గుట్టు బయటపడింది.
నిందితుల మొబైల్ ఫోన్లలో గత బ్లాక్ మెయిల్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అపరిచిత కాల్స్, సోషల్ మీడియా పరిచయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని మెట్‌పల్లి సీఐ వి. అనిల్ కుమార్ ప్రజలకు సూచించారు.