Telangana: ఈరోజు, రేపు తెలంగాణలో భారీ వర్షాలు

* ఉరుములు మెరుపులతో విస్తారంగా వర్షాలు * తెలంగాణలో పొంగి పొర్లుతోన్న వాగులు * హైదరాబాద్ శివార్లలో నీట మునిగిన కాలనీలు

Update: 2021-07-22 01:18 GMT

తెలంగాణలో భారీ వర్షాలు (ఫైల్ ఫోటో)

Telangana: తెలంగాణను ముసురు కమ్మేసింది. రాష్ట్రమ్మీద కమ్ముకున్న మేఘం కొన్ని చెట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా.. ఇంకొన్ని చోట్ల జల్లులుగా వర్షిస్తూనే ఉంది. భారీ వర్షాలతో వాగులు, కుంటలు, చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధి ప్రాంతాలు, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వానలు కురిశాయి. కొన్ని ప్రాంతాల్లో రోజంతా ముసురు పట్టింది. చెరువులు అలుగులు పోస్తున్నాయి. పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి. మట్టి రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటికే రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తు్న్నాయి. భారీ వర్షాల కారణంగా ఇరు రాష్ట్రాల్లో వాగులు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

రెండు రోజులుగా కురుస్తోన్న కుండపోత వర్షాలతో జూరాల, శ్రీశైలం, నాగార్జుసాగర్‌ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో 13 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దాంతో నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెన వాగుకు వరదనీరు పోటెత్తడంతో ఒక గేటు ఎత్తి వేశారు.

హైదరాబాద్‌లోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌ నిండుకుండలా మారాయి. హిమాయత్‌సాగర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో అడుగుమేర గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. మరోవైపు సింగరేణి ఏరియాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మంచిర్యాలలో కేకే, ఆర్‌కేపీ, ఎస్‌ఆర్పీ, ఇందారం ఉపరితల గనుల్లో ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ వెల్లడించింది.

Tags:    

Similar News