Heavy Rain in Telangana: బలపడ్డ అల్పపీడనం.. తెలంగాణా ప్రభుత్వం అప్రమత్తం

Heavy Rain in Telangana: దాదాపుగా రెండు నెలల నుంచి వరుస అల్పపీడనాలతో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు. వీటి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2020-09-21 01:07 GMT

 weather report

Heavy Rain in Telangana: దాదాపుగా రెండు నెలల నుంచి వరుస అల్పపీడనాలతో ప్రజలు ఉక్కిరి, బిక్కిరి అవుతున్నారు. వీటి వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. వీటి ప్రభావం వల్ల ప్రధాన నదుల్లోకి వరద ప్రవాహం పెరిగి, పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు చాలావరకు మునిగిపోయాయి. ఏపీలో గోదావరి శాంతించినా, కృష్ణమ్మ ఉరకలు వేస్తూనే ఉంది. ఇది పూర్తికాక ముందే మరొకటి.. అది పూర్తికాక ముందే వేరొకటి.. ఇలా రెండు నెలల నుంచి వస్తున్న వర్షాల వల్ల వేల ఎకరాల్లో పంటలు సైతం నీట మునిగాయి. ఇలా గ్రామాలను ముంచి, పంటలను నీట ముంచినా, వీటికి విశ్రాంతి లేనట్టు కనిపిస్తోంది. మరో రెండు రోజుల్లో వేరొక అల్పపీడనం రానన్నట్టు వాతావరణ శాఖ సమాచారం అందించింది. ఇలా మరో అల్పపీడనం వస్తుందని తెలియడంతో ప్రజలంతా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అయితే దీని ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో తెలంగాణాలోని ప్రధానంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

ఈశాన్య బంగాళాఖాతంలో ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారంనాటికి ఈ అల్పపీడనం వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. సోమ, మంగళవారాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, వరంగల్‌ అర్బన్, వరంగల్‌ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

రాజధానిలో కుండపోత

నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు హైదరాబాద్‌ నగరం జలమయమైంది. ఆదివారం పలు ప్రాంతాల్లో 5–7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో వరద పోటెత్తింది. జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వర్షపునీటిని బయటికి తోడిపోశాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి చేరి న వర్షపునీటితో పలు బస్తీల వాసులు అవస్థలు పడుతున్నారు. ఇటు వికారాబాద్‌ జిల్లా లోనూ భారీ వర్షం కురిసింది. పెద్దేముల్‌ మం డలంలోని గాజీపూర్, కందనెల్లి, ఇందూరు వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, అన్ని శాఖల అధికారులు జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

కలెక్టర్లు, ఎస్పీలు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని సూచించారు. 'భారీ వర్షాలతో వరదలు, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదముంది. చెట్లు, విద్యుత్‌ స్తంభాలు పడిపోవడం వల్ల సాధారణ కార్యకలపాలకు అంతరాయం ఏర్పడుతుంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండి పొంగి పోవటం వల్ల లోతట్టు ప్రాంతాలు, చిన్న బ్రిడ్జిలు, కాజ్‌వేలలో నీరు ప్రవహించే అవకాశముంది. ట్రాఫిక్‌ అంతరాయాలు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జారీ చేసిన వరదల నిర్వహణ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను కోరింది'అని రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags:    

Similar News