తెలంగాణలో దంచికొట్టిన వాన.. ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
Rains: సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దెలో 6.7సెం.మీ వర్షపాతం నమోదు
తెలంగాణలో దంచికొట్టిన వాన.. ఏడు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
Rains: తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఒడిశా,పశ్చిమ బెంగాల్ తీరాలకు దగ్గరలో సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. ఎత్తుకి వెళ్లే కొద్ది నైరుతి దిశగా కొనసాగుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నిన్నటి నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఈ నేపథ్యంలో ఏడు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ రాష్ట్రంలోని కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రాష్ట్రంలో రాగల ఏడురోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని, అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది.
నైరుతి రుతుపవనాల రాకతో శనివారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, మెదక్, కుమ్రం భీం ఆసిఫాబాద్ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్‌కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్దెలో రాష్ట్రంలోనే అత్యధికంగా 67.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం భూపాలపట్నంకు చెందిన తాక్కె బిక్కు పిడుగుపాటుకు గురై మృతి చెందాడు.
వర్షం కారణంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓసీ-2 గనిలో 2, 3వ షిఫ్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో 3వేల 500 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు ఏరియా పరిధిలోని కోయగూడెం ఓపెన్‌కాస్ట్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ఉదయం షిఫ్ట్‌లో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 10 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత నిలిచిపోయింది.