ఎన్.ఆర్.ఐ.ల పల్లెగా... నిజామాబాద్ జిల్లా గడ్కోల్ గ్రామం

Update: 2021-02-14 01:27 GMT

Representational Image

ఒకప్పుడు తుపాకుల మోతలు బూట్ల చప్పుళ్లతో దద్దరిల్లిన ఆ పల్లె ఇప్పుడు ఆదర్శ గ్రామంగా రూపు దిద్దుకుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయం భయంగా గడిపిన ఆ పల్లె వాసులు ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఎన్.ఆర్.ఐ.ల పల్లెగా గుర్తింపు తెచ్చుకున్నారు. మావోయిస్టు ప్రాబల్య గ్రామంగా.. రెండు జిల్లాల సరిహద్దులో ఉండే ఆ పల్లె ఇప్పుడు అభివృద్దిలో పరుగులు పెడుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఆదర్శపల్లె గడ్కోల్ పై హెచ్‌ఎంటీవీ ప్రత్యేక కథనం.

ఇదీ నిజామాబాద్ సిరికొండ మండలం గడ్కోల్ గ్రామం. కరీంనగర్-నిజామాబాద్ జిల్లాల సరిహద్దులో అటవీ ప్రాంతానికి సమీపంలోని ఈ పల్లె.. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావిత గ్రామం.చుట్టూ దట్టమైన అడవి.. మధ్యలో గ్రామం ఉండటంతో ఒకప్పుడు ప్రజలు భయం భయంగా బతికేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. విద్య, వ్యవసాయ, ఉపాధి రంగాల్లో ఆ గ్రామం ఆదర్శంగా నిలిచింది. విదేశాల్లో మంచి కొలువులు సాధించి.. ఒకప్పుడు మావోయిస్టుల పల్లెను ఇప్పుడు ఎన్.ఆర్.ఐ.ల పల్లెగా మార్చేశారు.

గడ్కోల్ గ్రామంలో వెయ్యి కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇటు వ్యవసాయ పరంగా ఉన్నతి లేకపోవడంతో చదువులు అంతంత మాత్రంగానే సాగేవి. దీనికి తోడు నక్సల్ ప్రభావంతో అభివృద్ధిలోనూ వెనుకంజలోనే ఉండేది. అయితే క్రమంగా వ్యవసాయ రంగంలో గ్రామం పురోగతి సాధించడంతో గ్రామ రూపురేఖలు మార్చేసింది. వివిధ రకాల పంటలు సాగు చేస్తూ లాభాలు గడించిన రైతులు తమ పిల్లలను చదువుల్లో ప్రోత్సహించారు. దీంతో చాలా మంది అమెరికా, కెనడా, న్యూజిలాండ్, యూకే, ఆస్ట్రేలియాలలో ఉన్నత ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ప్రస్తుతం గ్రామం నుంచి వివిద దేశాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువత ఇంటికొకరు ఉన్నారు. విదేశాల్లో అత్యధికంగా ఉద్యోగాలు సాధించిన గ్రామంగా గడ్కోల్ గ్రామం రికార్డులకు ఎక్కడం గమనార్హం. విదేశాల్లో 80 మందికి పైగా స్దిర పడగా.. పోలీస్ శా‌ఖతోపాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఎంతో మంది యువకులు ఉద్యోగాలు సాధించి ఉద్యోగుల పల్లెగా కూడా పేరు తెచ్చుకుంది. కరోనా కారణంగా విదేశాల్లో ఉద్యోగాలు చేసే అనేక మంది యువత ప్రస్తుతం ఇంటి నుంచి పని చేస్తున్నారు. కుగ్రామం నుంచి ఎదిగి విదేశాల్లో ఉద్యోగాలు చేసే స్థాయికి రావడం సంతోషంగా ఉందని యువకులు చెబుతున్నారు.

ఎవరో వస్తారు.. ఏదో చేస్తారని ఎదురుచూడకుండా.. అక్షర సేద్యం చేస్తూ తమ తల రాతలు మార్చుకున్నారు ఈ గ్రామస్తులు. ఎన్నో పల్లెలకు స్పూర్తిగా నిలుస్తోంది. ఇలాంటి పల్లెలకు ప్రభుత్వం మరింత సహకారం అందిస్తే రాష్ట్రానికి ఆదర్శ పల్లెగా మారే అవకాశం ఉందని గ్రామస్ధులు చెబుతున్నారు.

Tags:    

Similar News