Coronavirus Variants: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రకాల కోవిడ్ వైరస్‌లు
Coronavirus Variants: కంటికి కనిపించని శత్రువు ప్రపంచదేశాలపై ముప్పేటా దాడి చేస్తోంది.
Coronavirus Variants: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రకాల కోవిడ్ వైరస్‌లు
Coronavirus Variants: కంటికి కనిపించని శత్రువు ప్రపంచదేశాలపై ముప్పేటా దాడి చేస్తోంది. అంతేకాదు.. ఈ మహహ్మారి వైరస్ ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతూ వస్తోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలలకో ఓ వేరియంట్ అధికంగా వ్యాప్తిలో ఉంటోంది. మొదటిదశ ఉద్ధృతిలో ప్రధానంగా మూడు రకాల వైరస్‌లు వ్యాప్తిలో ఉండగా రెండోదశలో ఒకటి కనుమరుగై మరొకటి అధిక వ్యాప్తికి కారణమవుతోంది. ఇక ఒక్కోరకం వైరస్ మూడు నుంచి ఆరునెలల వరకు ప్రభావం చూపిస్తున్నాయంటున్నారు సైంటిస్టులు.
చెప్పాలంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తించే క్రమంలో రూపాంతరం చెందుతూ వస్తోంది. ఒక్కోదాంట్లో 15 వరకు మ్యుటేషన్లు ఉన్న వైరస్ రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి. ఈ మార్పులు తెలుసుకునేందుకు సీసీఎంబీతోపాటు సీడీఎఫ్‌డీ, మరికొన్ని సంస్థలు వైరస్ జన్యుక్రమ ఆవిష్కరణలు చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 30కిపైగా సంస్థలు ఈ పరిశోధనలు చేస్తున్నాయి. ఇక రోజువారీ వస్తున్న నమూనాల్లో కనీసం 5శాతం నుంచి జన్యుక్రమ ఆవిష్కరణ చేయాలని కేంద్ర మార్గదర్శకాలున్నా ఆచరణలో అతి తక్కువ నమూనాలనే పరీక్షిస్తున్నారు.
గతేడాది మార్చిలో తెలంగాణలో తొలి కోవిడ్ కేసు నమోదైంది. కోవిడ్-19 వైరస్ చైనా నుంచి ప్రపంచదేశాలకు వ్యాపించినా భారత్‌కు సమీపంలోని ఆసియా దేశాల నుంచి ఇక్కడికి పాకింది. దాదాపు మూడునెలలపాటు వ్యాప్తిలో ఉంది. అయితే మార్చిలో ఏ2ఏ, ఏ3, ఏ3ఏతోపాటు బీ1, బీ4, ఏ1ఏ వైరస్‌లు ఉన్నా ఎక్కువగా ఏ3ఐ రకం వ్యాప్తిని గుర్తించారు. ఏప్రిల్ వరకు ఇది కనిపించింది. అప్పటివరకు అంతర్జాతీయంగా వ్యాప్తిలో ఉన్న రకాలకు ఇది భిన్నంగా కన్పించింది.
తర్వాత.. ఏ2ఏ రకం వైరస్ రకం వ్యాప్తి ఏప్రిల్ నాలుగోవారం నుంచి మొదలైంది. ఇది మూడునెలల్లో పూర్తిగా విస్తరించింది. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా ఏ2ఏ రకం ఎక్కువగా వ్యాప్తించింది. అప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఈ రకం వైరసే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. ఇక జూన్ రెండో వారం తర్వాత ఏ2ఏ తప్ప ఇతర రకాల వైరస్ వ్యాప్తి లేదని శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు.
ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో సెప్టెంబరులో కోవిడ్ మొదటిదశ గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో ఎన్400కె రకం వైరస్ ఎక్కువగా వ్యాప్తిలో ఉంది. అప్పటివరకు ఉన్న ఏ2ఏ, ఏ3ఏ వ్యాప్తి క్రమంగా తగ్గిపోయింది. ఎన్440కె రకం వైరస్ ఏ2ఏ కంటే పదిరెట్లు, ఏ3ఐ కంటే వెయ్యి రెట్ల అధిక ఇన్‌ఫెక్షన్‌కు గురిచేస్తుందని కొన్ని అధ్యయనాలు వెలువడ్డాయి. జనవరి వరకు దీని ప్రభావం కన్పించగా మార్చి నుంచి కనుమరుగవుతూ వస్తోంది.
చెప్పాలంటే మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో మార్చి నుంచి కోవిడ్ రెండో ఉద్ధృతి మొదలైంది. అప్పటి నుంచి కొత్తరకం వైరస్ బి.1.617 వ్యాప్తి పెరగడం కనిపించింది. ఇండియన్ వేరియంట్, డబుల్ మ్యుటెంట్‌గా పిలిచే బి.1.617 మహారాష్ట్రలో కేసుల పెరుగుదలకు కారణమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువ ప్రాంతాల్లో ఈవైరస్ కన్పిస్తోంది. ఇక మరో రెండునెలలు ఈవైరస్ ప్రభావం ఉండే అవకాశముందని అంచనా వేస్తున్నారు.