Huzurabad: నోటిఫికేషన్ వచ్చేదెప్పుడో... ఈక్వేషన్ మారుతోందా?

Huzurabad: తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ త్వరలో రానుందా?

Update: 2021-09-03 10:48 GMT

Huzurabad: నోటిఫికేషన్ వచ్చేదెప్పుడో... ఈక్వేషన్ మారుతోందా?

Huzurabad: తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ త్వరలో రానుందా? రాజకీయ పార్టీలు తమ నేతలు, క్యాడర్‌కు ఇస్తున్న సంకేతాలు ఏంటి? ఉప ఎన్నిక షెడ్యూల్ త్వరలో రానుందన్న ప్రచారాల మధ్య... హుజూరాబాద్‌లో రాజకీయం ఏ మలుపు తిరగబోతోంది? అసలు హుజూరాబాద్‌ నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది? రాజకీయ పార్టీలలో జరుగుతున్న చర్చ ఏంటి?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు హుజురాబాద్ చుట్టే తిరుగుతున్నాయి. పథకం ప్రవేశ పెట్టినా, పాదయాత్ర చేసినా, దీక్షకు దిగినా కార్యక్రమం ఏదైనా హుజురాబాద్‌ను ప్రభావితం చేసేలానే ఉంటున్నాయి. మూడునెలలుగా హుజురాబాద్ ఉపఎన్నిక కోసం అభ్యర్థులను ఖరారు చేయకున్నా ఎన్నిక ఎప్పుడో తెలియకున్నా ముమ్మరంగానే ప్రచారం చేస్తున్నాయి.

పార్టీల వ్యవహారం అభ్యర్థుల ప్రచారం ఇలా కొనసాగుతున్న సమయంలోనే సెప్టెంబర్ మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు అంచనాలు వేస్తున్నాయట. ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించిన వెంకటసుబ్బయ్య మార్చి 28న మృతి చెందారు. నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 28లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. బద్వేలు ఉపఎన్నిక కోసం నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడే హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉందని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఇటు హుజురాబాద్ స్థానానికి ఈటల రాజేందర్ జూన్‌లో రాజీనామా చేసినప్పటి నుంచి నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొచ్చని రాజకీయ పార్టీలు హడావిడి మొదలుపెట్టాయి. అప్పటి నుంచి హుజురాబాద్‌లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. కాకపోతే ఇప్పుడు బద్వేలును లెక్కలోకి తీసుకుంటే హుజూరాబాద్‌కు కూడా ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావొచ్చని లీడర్లు క్యాడర్‌ను అలెర్ట్‌ చేస్తున్నారు.

ఇక్కడ ఇంకో లెక్కుందట. హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరున్నొక్క రాగాలు ఆలపిస్తుంటే కేంద్రంలోని బీజేపీ నేతల ప్రియారిటీస్ క్షణక్షణం మారుతున్నాయట. ఇప్పటి వరకు బీజేపీ నేతలకు బెంగాల్ సీఎం మమత చుక్కలు చూపించారు. మొన్నటి ఎన్నికల్లో ఆమె ఓటమి చవి చూశారు. అయినా ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఆరు నెలల్లో ఉప ఎన్నికల్లో గెలిస్తే ఆమె సీఎంగా కొనసాగుతారు. లేకపోతే తన వీర విధేయుడికి సీఎం కుర్చీ త్యాగం చేయాల్సి వస్తుంది. అదే జరిగితే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీగా బీటలు పడటం ఖాయంగా భావిస్తున్నారు విశ్లేషకులు.

ఇప్పుడిదే విషయం మమతను కూడా ఆందోళనలో పడేసింది. అందుకే బెంగాల్లో ఇప్పటివరకు డిమాండ్ రూపంలో కూడా లేని విధానసభ అంశాన్ని ముందుకు తెచ్చారు. మండలికి కేంద్రం ఒప్పుకోకపోతే, బెంగాల్లో మమత సీటు కిందికి నీళ్లు రావడం ఖాయం. అదే జరిగితే తృణమూల్ కాంగ్రెస్లో అలజడి రేగుతుంది. అసంతృప్తులు, నిరసనకారుల సంఖ్య పెరుగుతుంది. వారందరినీ కంట్రోల్ చేసే యుక్తిగానీ, సామర్థ్యం గానీ మమతకు ఉన్నంత, ఆమె విధేయులకు ఉండే అవకాశమే లేదు. ఇది జరగకుండా ఉండేందుకే ఆ రాష్ట్రంలో విధానసభ పెట్టాలని మమత హడావుడిగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.

మమత పోటీ చేయాల్సి ఉన్న భవానీపూర్ ఇప్పటికే ఖాళీగా ఉంది. మమతను అటు నుంచి అటే ఇంటికి పంపించేందుకు బీజేపీ వ్యూహాలు పన్నుతోందట. కరోనా థర్డ్ వేవ్ సాకుతో కేంద్రం ఆధీనంలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం భవానీపూర్ ఎన్నికను ఇప్పట్లో నిర్వహించే అవకాశం కనిపించడం లేదన్న ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి. బీజేపీ హైకమాండ్ ఆలోచన మేరకే బెంగాల్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఆలస్యం కావచ్చని, బద్వేలు, హుజూరాబాద్‌కు కూడా నోటిఫికేషన్ వచ్చే చాన్స్ ఇప్పట్లో లేదని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అనివార్య పరిస్థితుల్లో హుజూరాబాద్‌ ఉపఎన్నిక ఆలస్యమవుతున్న కొద్దీ అది ఈటల సానుభూతి పవనాలను బలహీనం చేస్తుందని, దీనివల్ల ఈటల సర్వశక్తులు ఒడ్డినా గెలుపు అంత సులభం కాదని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. తమ మీద వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే బీజేపీ నేతలకు ఈటల గెలుపు కన్నా మమతను ఇంటికి పంపించడమే ముఖ్యం. కాబట్టి, హుజూరాబాద్ అంశాన్ని బీజేపీ నేతలు అటకెక్కించడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ భవానీపూర్‌తో పాటు, బద్వేల్ ఉపఎన్నిక ఆలస్యమైతే ఈటల రాజకీయ భవిష్యత్తును బీజేపీ నేతలే చేజేతులా పాడు చేసినట్లవుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజీపీ అధినాయకత్వం, ఎలక్షన్‌ కమిషన్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రేపేం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News