TS Election Results 2023: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌

TS Election Results 2023: రాష్ట్ర వ్యాప్తంగా 49 సెంటర్లలో ఓట్ల లెక్కింపు

Update: 2023-12-03 01:52 GMT

TS Election Results 2023: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌

TS Election Results 2023: రెండు నెలల ఉత్కంఠకు తెరపడనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల లెక్కింపు కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని మొత్తం 119 శాసనసభ నియోజకవర్గాల్లో పోటీపడిన 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నిజమవుతాయా? అందుకు భిన్నంగా ఫలితాలు వస్తాయా? ఎవరెవరు గెలుస్తారు? ఎవరికి దెబ్బపడుతుంది? అధికారంలోకి వచ్చేది ఎవరన్న దానిపై రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది.

119 అసెంబ్లీ సీట్లలో బీఆర్‌ఎస్‌ పోటీ చేయగా.. కాంగ్రెస్‌ 118 చోట్ల, పొత్తులో సీపీఐ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. మరో కూటమిలో బీజేపీ 111, జనసేన 8 స్థానాల్లో పోటీచేశాయి. బీఎస్పీ 107, ఎంఐఎం 9, సీపీఎం 19, సీపీఐఎల్‌ న్యూడెమోక్రసీ ఒక స్థానంలో బరిలో ఉన్నాయి. రాష్ట్రంలో 31 జిల్లా కేంద్రాల్లోని 31 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో 14, రంగారెడ్డి జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో కలిపి మొత్తం 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

99 స్థానాలకు 14 టేబుళ్లు చొప్పున, 4 స్థానాలకు 16 టేబుళ్ల చొప్పున, 6 స్థానాలకు 18 టేబుళ్ల చొప్పున, మూడు స్థానాలకు 30 టేబుళ్ల చొప్పున.. 500కిపైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాలకు సంబంధించి 28 టేబుళ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి టేబుళ్లకు అదనంగా.. రిటర్నింగ్‌ అధికారి కోసం మరో టేబుల్‌ ఉంటుంది. మొత్తం 1,798 టేబుల్స్‌ ఏర్పాటు చేయగా...వాటిలో ఆర్‌వో, పోస్టల్‌ బ్యాలెట్ల కోసం 131 టేబుల్స్‌ వినియోగిస్తారు.

సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ కౌంటింగ్ కు 23 రౌండ్లు పట్టనున్నాయి.కామారెడ్డి కౌంటింగ్ కు 19 రౌండ్స్ పట్టనున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కొడంగల్ కౌంటింగ్ కు 20 రౌండ్స్ పట్టనున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది.

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 26 రౌండ్లలో, భద్రాచలం నియోజకవర్గంలో అతి తక్కువగా 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తంగా 119 స్థానాల్లో కలిపి 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో 44 మంది అభ్యర్థులు, కామారెడ్డిలో 39 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అలాగే మునుగోడులో 39 మంది, పాలేరులో 37 మంది పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ నియోజకవర్గంలో పది మంది బరిలో ఉన్నారు.

శాసనసభ ఎన్నికల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ సాధించి అధికారంలోకి వస్తామని అధికార బీఆర్‌ఎస్, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ధీమాగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచి హాట్రిక్‌ కొడతామని బీఆర్‌ఎస్‌.. తెలంగాణలో తొలిసారి అధికారం చేపడతామని కాంగ్రెస్‌ అంటున్నాయి. హంగ్‌ ఏర్పడితే ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుందని బీజేపీ, ఎంఐఎం ఆశలు పెట్టుకున్నాయి.తుది ఫలితాలు ఎలా ఉన్నా తొలి రెండు స్థానాల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లే ఉంటాయని.. మూడో స్థానం కోసం ఎంఐఎం, బీజేపీ తలపడనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News