Corona effect to GHMC Markets: కరోనా కట్టడికి జీహెచ్‌ఎంసీ చర్యలు.. రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానా..

Update: 2020-07-22 11:06 GMT

Corona effect to GHMC Markets: గ్రేటర్ హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా వైరస్‌ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్న సంతలలో మాత్రం ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావట్లేదు. వ్యాపారుల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండగా వినియోగదారుల్లోనూ అప్రమత్తత తగ్గుతోంది. వైరస్‌ కట్టడిలో భాగంగా మార్కెట్లలోని దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, మాస్కులు ధరించే వ్యాపారం చేయాలని అధికారులు సూచిస్తున్నా ఎక్కడా ఆ చర్యలు కనిపించట్లేదు.

కరోనా కట్టడికోసం జీహెచ్‌ఎంసీ అధికారులు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. నేటి నుంచి మూడు వారాల పాటు సికిందరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా వారం వారం సంతలు నిర్వహించవద్దన్నారు. ఇందులో ప్రధానంగా వారంవారం బస్తీలు, కాలనీల్లో ఏర్పాటు చేసే సంతలను నేటి నుంచి 20 రోజుల పాటు పెట్టకూడదని అధికారులు నిర్ణయించారు. కూరగాయలు కొనుగోలు చేయడం కోసం ప్రజలు వారంవారం జరిపే సంతలకు వచ్చి భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జూలై 21 నుంచి నియోజకవర్గంలో ఎక్కడ కూడా సంతలు జరుపకూడదని ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా సంతలు నిర్వ హిస్తే కఠిన చర్యలతోపాటు జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.


Tags:    

Similar News