ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: తెలంగాణ కాంగ్రెస్‌లో రేసులో వీరే...

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Update: 2025-02-25 06:35 GMT

 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: తెలంగాణ కాంగ్రెస్‌లో రేసులో వీరే...


ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ ఏడాది మార్చి 20న పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. తెలంగాణలోని ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.

తెలంగాణకు చెందిన మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గే మల్లేశం,మిర్జా రియాజుల్ హసన్ ఎపెండి పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. ఈ ఐదుగురు ఎమ్మెల్సీలలో నలుగురు బీఆర్ఎస్ కు చెందిన వారు. మిర్జా రియాజుల్ హసన్ ఎంఐఎంకు చెందినవారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా కాంగ్రెస్ కు నలుగురు, బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది.

తెలంగాణలో అధికారంలో ఉన్న హస్తం పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ పదవులు దక్కనున్నాయి. అయితే ఈ పార్టీలో పోటీ ఎక్కువగా ఉంది. నలుగురు అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమతుల్యతపై కూడా ఆ పార్టీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకూడదని హస్తం పార్టీ భావిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో ఎమ్మెల్సీ ఎన్నికల విషయమై చర్చించనున్నారు. ఫిబ్రవరి 25న ఆయన దిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

గతంలో ఎమ్మెల్సీ సీటు అద్దంకి దయాకర్ కు కాంగ్రెస్ నాయకత్వం ప్రకటించింది. కానీ, చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ స్థానంలో మహేశ్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్సీ సీటు దక్కింది. దీంతో ఈసారి అద్దంకి దయాకర్ పేరు ఎమ్మెల్సీ రేసులో ముందు వరుసలో ఉంది. దీనికి తోడు వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్టు ఆశించిన దొమ్మాట సాంబయ్యకు పార్టీ నాయకత్వం టికెట్టు ఇవ్వలేదు. దొమ్మాట సాంబయ్య స్థానంలో అప్పట్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు కాంగ్రెస్ నాయకత్వం టికెట్టు కేటాయించింది. దీంతో దొమ్మాట సాంబయ్య కూడా తనకు ఎమ్మెల్సీ టికెట్టు ఇవ్వాలని కోరుతున్నారు. అద్దంకి దయాకర్, దొమ్మాట సాంబయ్య దళిత సామాజికవర్గానికి చెందినవారే. ఇక ఎస్టీ సామాజికవర్గం నుంచి బెల్లయ్య నాయక్ పేరు కూడా వినిపిస్తోంది. ఇక ఖమ్మం జిల్లా వైరాకు చెందిన బానోతు విజయబాయి పేరు తెరమీదికి వచ్చింది.

ఇక ఓసీ కోటాలో వేం నరేందర్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్ రెడ్డి పోటీకి విముఖత చూపారు.. బీసీ కోటాలో ఈరావత్ అనిల్, సునీతారావు, వి. హనుమంతరావు, మధు యాష్కీ, చరణ్ కౌశిక్ యాదవ్, వజ్రేష్ యాదవ్ పేర్లు తెరమీదికి వచ్చాయి. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఫహిం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేర్లు వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల పేర్లను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరిశీలనలోకి తీసుకోవద్దని పార్టీ నాయకత్వం భావిస్తోందని ప్రచారం తెరమీదికి వచ్చిన నేపథ్యంలో జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి , అజారుద్దీన్, షబ్బీర్ అలీ, వజ్రేష్ యాదవ్, మధు యాష్కీ రేసు నుంచి తప్పించినట్టేననే ప్రచారం కూడా సాగుతోంది

Tags:    

Similar News