KCR: నేడు నిమ్స్ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
KCR: ఉ.11.40కి భూమి పూజ చేయనున్న సీఎం కేసీఆర్
KCR: నేడు నిమ్స్ హాస్పిటల్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
KCR: హైదరాబాద్‌లో ఉన్న నిమ్స్ ఆసుపత్రి మరింత ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. అంతేకాదు..నిమ్స్ ఆసుపత్రిని విస్తరించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ నిమ్స్ ఆసుపత్రి విస్తరణకు సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. 1571 కోట్లతో నిర్మించనున్న ఆసుపత్రి నూతన భవన నిర్మాణం, దాని విశేషాలకు ప్రభుత్వం విడుదల చేసింది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్‌తో పాటు, అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో పండగ వాతావరణంలో వైద్యారోగ్య దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. అందులో భాగంగా నిమ్స్ కొత్త బ్లాక్ నిర్మాణానికి ఇవాళ సీఎం కేసీఆర్ భూమిపూజ చేయనున్నారు. నిమ్స్ విస్తరణ కోసం ప్రభుత్వం దాదాపు 1571 కోట్ల రూపాయలను కేటాయించింది. నిమ్స్ విస్తరణ కోసం మొత్తం 32 ఎకరాలు, 16 గుంటల భూమిని కేటాయించారు. ఆసుపత్రిని 4 బ్లాకుల్లో నిర్మించనున్నారు. మొత్తం బిల్ట్ అప్ ఏరియా 23లక్షల, 96వేల, 542 చదరపు అడుగులు ఉండనుంది. నిమ్స్ నూతన భవనాన్ని 4 బ్లాకులుగా నిర్మించనున్నారు. అందులో బ్లాక్ Aలో OPD విభాగాన్ని ఏర్పాటు చేయనుంది. అంటే గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు జీ-8 అంతస్తులుగా దీనిని నిర్మించున్నారు. ఇక బ్లాక్ Bలో ఇన్‌పేషంట్ విభాగం IPD బ్లాక్‌ను గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మొత్తం 13 అంతస్తులుగా నిర్మించనున్నారు. అలాగే బ్లాక్ Dలో ఇన్‌పేషంట్ IPD బ్లాక్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు 14 అంతస్తులుగా నిర్మించనున్నారు. ఇక బ్లాక్ Cలో ఎమర్జెన్సీ విభాగాన్ని గ్రౌండ్‌ఫ్లోర్‌తో పాటు 8 అంతస్తులుగా నిర్మించనున్నారు.
నిమ్స్ విస్తరణలో భాగంగా నిర్మిస్తున్న కొత్త భవనంలో మొత్తం 2వేల కొత్త పడకలు రానున్నాయి. అందులో OPD ఛాంబర్‌లు 120, ఆక్సిజన్ పడకలు 1200, ICU పడకలు 500 వరకు ఉంటాయి. 32 ప్రధాన మాడ్యులర్ థియేటర్లు, 6 ప్రధాన మాడ్యులర్ ఎమర్జెన్సీ థియేటర్లు, 38 డిపార్ట్మెంట్స్ నిమ్స్ కొత్త భవనంలో ఉండనున్నాయి. ప్రస్తుతం ఉన్న 2వేల బెడ్స్ తో పాటు అదనంగా వచ్చే మరో 2వేల పడకలతో మొత్తం 4వేల బెడ్స్ తో దేశంలోనే అతి పెద్ద ఆసుపత్రిగా భవిష్యత్తలో నిమ్స్ అవతరించనుంది. అయితే ఇప్పటికే వైద్యారోగ్యమంత్రి హరీష్‌రావు..నిమ్స్ కొత్త భవనం నిర్మాణానికి సంబంధించిన భూమిపూజ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా భూమిపూజకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు.
దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈనెల 14న హైదరాబాద్‌తో పాటు, అన్ని జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో పండగ వాతావరణంలో వైద్యారోగ్య దినోత్సవాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, అర్బన్ సెంటర్లలో పండగ వాతావరణం నెలకొనేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగే ఉత్సవాలలో ఆశా, అంగన్ వాడి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది హాజరుకానున్నారు. గత తొమ్మిదేళ్లలో జిల్లాలో వైద్యారోగ్య రంగంలో వచ్చిన మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలు, కొత్త మెడికల్ కాలేజీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఇతర అభివృద్ది కార్యక్రమాల వివరాలను తెలియచేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన పథకాలపై ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో సేవలు అందించిన ఉత్తమ ఉద్యోగులు, కార్యకర్తలను గుర్తించి వారికి మెమెంటోలు, సర్టిఫికెట్లు, చీరెలు, మెమెంటోలను బహూకరించనున్నారు.