ఐఏఎస్ చదవమంటే, రాజకీయాల్లోకి వచ్చా: చంద్రబాబు

‘‘నన్ను చాలా మంది ఐఏఎస్ చదవమన్నారు. కానీ, రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

Update: 2025-12-27 14:18 GMT

హైదరాబాద్: ‘‘నన్ను చాలా మంది ఐఏఎస్ చదవమన్నారు. కానీ, రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవంలో ఆయన ప్రసంగించారు. యూనివర్శిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, రెండేళ్లల్లో మంత్రిని అయ్యానని చెప్పారు. గండిపేటకు వస్తే చాలా పాత విషయాలు గుర్తుకొస్తాయన్నారు. గండిపేట పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉండేదని, ఒకప్పుడు రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా గండిపేట ఉండేదని, ఇప్పుడు చిన్నారులకు శిక్షణ ఇస్తోందని వివరించారు.

గండిపేటలో భావితరాల కోసం నాయకత్వాన్ని తయారు చేశామని, ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న తరగతుల్లోనే నాడు నాయకత్వ శిక్షణా శిబిరాలు నిర్వహించామని చెప్పారు. ఫ్యాక్షన్ గొడవలు, రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన కుటుంబాల్లోని పిల్లలకు పెద్ద దిక్కుగా ఉండేలా ఎన్టీఆర్ విద్యా సంస్థలు ప్రారంభించామని చెప్పారు. చిన్న మొక్కగా ప్రారంభించిన విద్యా సంస్థలను పెద్ద వృక్షంగా మార్చారన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు, విద్యా సంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారని కొనియాడారు.

ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో చదువుకున్న వారు గ్రూప్-1 పరీక్షల్లో నలుగురు పాస్ అయ్యారని, ముగ్గురు జూనియర్ సివిల్ జడ్డీలుగా ఎంపికయ్యారని తెలిపారు. ఎన్టీఆర్ విద్యా సంస్థల్లో విద్యనభ్యసించిన వారికి దేశంలోని వివిధ ప్రముఖ విద్యా సంస్థల్లో 29 మందికి సీట్లు వచ్చాయన్నారు. 131 మందితో విద్యా సంస్థను ప్రారంభించామని, ఇప్పుడు 1641 మంది చదువుతున్నారని, సంస్థ ఈ స్థాయికి ఎదగడానికి నారా భువనేశ్వరినే కారణం అని చెప్పారు.

తాను రాజకీయాల్లో బిజీ అయ్యాక, హెరిటేజ్ బాధ్యతలు చూడాలని భువనేశ్వరిని కోరినట్లు చెప్పారు. అయిష్టంగా హెరిటెజ్ బాధ్యతలు తీసుకున్న భువనేశ్వరి ఆ సంస్థను అద్భుతంగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పట్టుదలతో హెరిటెజ్ సంస్థను నడిపించారని, తాను ఇంకా పేపర్ చూసి స్పీచ్ ఇస్తున్నానని, భువనేశ్వరి ట్యాబ్ చూసి స్పీచ్ ఇస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు.

తాను టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నానని, భువనేశ్వరి టెక్నాలజీని వినియోగిస్తున్నారని చెప్పారు. ఎన్టీఆర్ మాదిరిగా భువనేశ్వరికి పట్టుదల ఉందని, మొండితనమూ ఉందని అన్నారు. భువనేశ్వరి ఏదైనా చేయాలని సంకల్పం తీసుకుంటే పట్టుదలతో చేస్తారని చెప్పారు. భార్యగా, తల్లిగా, గృహిణిగా, ట్రస్టీగా, హెరిటెజ్ ఎండీగా భువనేశ్వరి చాలా విజయాలు సాధించారని సీఎం చెప్పారు. 

Tags:    

Similar News