భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి : కిషన్ రెడ్డి
వందేమాతరం స్ఫూర్తితో వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్: వందేమాతరం స్ఫూర్తితో వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పోసిన త్యాగస్ఫూర్తి, దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని చెప్పారు. వందేమాతరం 150 ఏళ్ల సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ సంకల్పాన్ని తెలియజేసేలా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ కోఠిలోని వివేక వర్ధిని విద్యాసంస్థలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
వీవీ కళాశాలలో నిర్వహించిన వందేమాతరం కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ, సుమారు 150 సంవత్సరాల క్రితం మహాకవి బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారతమాత ఔన్నత్యం, ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. బ్రిటిష్ పాలకుల “విభజించి పాలించు” విధానానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసిన శక్తి వందేమాతరమేనని, కులం, మతం, ప్రాంత భేదాలు మరిచి “దేశమే ప్రథమం” అన్న భావనను పెంపొందించిందని మంత్రి అన్నారు. 1905 బెంగాల్ విభజన ఉద్యమం నుంచి 1942 క్విట్ ఇండియా ఉద్యమం వరకు ప్రతి స్వాతంత్ర్య పోరాటంలోనూ వందేమాతరం నినాదం మార్మోగిందని గుర్తు చేశారు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత హైదరాబాద్ గడ్డపై త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడేలా చేసిన సర్దార్ వల్లభ భాయ్ పటేల్ కి మనం ఎప్పటికీ రుణ పడి ఉంటామన్నారు. 1938లో నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రారంభమైన వందేమాతర ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వందేమాతరం గీతాన్ని ఆలపించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకున్నారని, ఆ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు, మేధావులు త్యాగాలు చేశారని మంత్రి అన్నారు.
వందేమాతరం నినాదంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా వివిధ సామాజిక, జాతీయ సంస్థలు రాజకీయ భేదాలను పక్కనపెట్టి ఐక్యపోరాటం చేసిన చరిత్ర హైదరాబాద్‌కు గర్వకారణమని పేర్కొన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశ పునర్నిర్మాణంలో, వికసిత భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని మంత్రి పిలుపునిచ్చారు.