ఈనెల 29న ధరణి పోర్టల్ ప్రారంభం

Update: 2020-10-28 07:49 GMT

రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. దశాబ్దాలుగా పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి ధరణి వేదిక కానుంది.

దశాబ్దాలుగా పీఠముడిగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా తెలంగాణ సర్కార్ అన్ని జాగ్రత్తలు తీసుకుంది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవిష్యత్తులో స్థిరాస్తుల విషయంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ధరణి పోర్టల్ తో చెక్ పెట్టింది. దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన ప్రభుత్వం ఈనెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇప్పటికే ధరణి పోర్టల్ కు కావాల్సిన సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పరికరాలు అన్ని మండల కేంద్రాలకు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అందజేసిన ప్రభుత్వం దీని నిర్వహణ కోసం రెవెన్యూ సిబ్బందికి, ఉన్నతాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. ఇందులో భాగంగా చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ స్వయంగా తాసిల్దార్ లకు ధరణీ పని తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

గతంలో రెవెన్యూ కార్యాలయాల్లో కొనసాగిన అవినీతికి చెక్ పెట్టే విధంగా, సులభతర విధానంలో ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. భూ సమస్యలు పరిష్కరించే దిశగా ఈ పోర్టల్ ఉండనుంది. వ్యవసాయ భూములు తాసిల్దార్ కార్యాలయంలో, వ్యవసాయేతర ఆస్తులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కానున్నాయి. వ్యవసాయ భూములకు పచ్చరంగు పట్టాదారు పాసు బుక్కు, వ్యవసాయేతర ఆస్తులకు మెరున్ కలర్ పాస్బుక్ ఇవ్వనుంది ప్రభుత్వం. ఒకేసారి రిజిస్ట్రేషన్ తో పాటు మ్యుటేషన్ కూడా చేయనున్నారు. నిర్వహణలో తలెత్తే సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ తో పాటు, ప్రతి జిల్లాలో టెక్నికల్ సపోర్ట్ టీం అందుబాటులో ఉండనుంది. మొత్తానికి మున్సిపల్, పంచాయతీ రాజ్, రెవెన్యూ చట్టాలతో సంస్కరణ జోరు పెంచిన సర్కార్ ధరణి పోర్టల్ ద్వారా దేశంలోనే భూ సమస్యల పరిష్కారానికి ట్రెండ్ సెట్టర్ గా నిలవాలని భావిస్తోంది.

Tags:    

Similar News