నేను కూడా ఓ జిల్లాను దత్తత తీసుకుంట పని ఎట్ల జరగదో చూస్త- సీఎం కేసీఆర్

Telangana: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు.

Update: 2021-06-14 01:15 GMT

సీఎం కేసీఆర్(ఫైల్ ఇమేజ్ )

Telangana: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్ధులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సీఎం స్పష్టం చేశారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని అదనపు కలెక్టర్లకు డిపివోలకు సీఎం మరోసారి తేల్చి చెప్పారు.

అన్ని అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించినా కూడా, నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించకోపోవడం నేరమని సీఎం అధికారులను ఉద్దేశించి స్పష్టం చేశారు. ''నేల విడిచి సాము చేయడం అనేది మనకు అలవాటయ్యింది. మన పక్కన్నే చేయవలసినంత పని వున్నది. అది ఒదలి ఎక్కన్నో ఏదో చేయాలనుకోవడం సరికాదు. ఆరునెల్ల పాటు కష్టపడండి. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ధి కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలం'' అని సీఎం అన్నారు. ''నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంట. అదనపు కలెక్టరు నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం.'' అని సీఎం స్పష్టం చేశారు.

జూన్ 20 న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలుంటాయని సీఎం తెలిపారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో సీఎం ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవఖానకు శంఖుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు. స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించే క్రమంలో అప్పటికప్పుడు కొన్ని అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రతీ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు 25 లక్షల రూపాయలను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమావేశం ముగిసేలోపే ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోను అడిషనల్ కలెక్టర్లకు అందించారు.

Tags:    

Similar News