హుజూర్‌నగర్‌ ప్రజలకు కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్..

Update: 2019-10-27 05:00 GMT

హుజూర్ నగర్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన సీఎం కేసీఆర్.. ఇది మామూలు విజయం కాదన్నారు. హుజూర్ నగర్ ఓటర్లు నీళ్లేవో, పాలేవో తెలుసుకుని గెలిపించారని చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా కృతజ్ఞత సభకు ముఖ్యఅతిథిగా హాజరై కార్య కర్తలు, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. హుజూర్‌నగర్‌లోని ఏడు మండలాలు, 134 గ్రామపంచాయతీల ప్రజలు టీఆర్‌ఎస్‌కు అందించిన ప్రేమకు, విజయానికి ప్రతిఫలం రావాలన్న సీఎం కేసీఆర్.. ప్రతి గ్రామపంచాయతీకి రూ.25 లక్షలు, మండల కేంద్రానికి రూ.30 లక్షల చొప్పున మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. హుజూర్‌నగర్ పట్టణాభివృద్ధికి సీఎం నిధుల నుంచి రూ.25 కోట్లు మంజూరుచేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గంలోని నేరేడుచర్ల అభివృద్ధికి మరో రూ.15కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఉవ్వెత్తున ఉత్సాహపరిచే ఫలితాన్ని ఇచ్చినందుకు దానికి సరిసమానంగా హుజూర్‌నగర్ అద్భుతమైన, నిజమైన హుజూర్ అనే పరిస్థితి రావాలన్నారు.

ఇక్కడి గిరిజన బిడ్డలకోసం రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. బంజారాభవన్‌ను కూడా నిర్మిస్తామన్నారు. హుజూర్‌నగర్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌తో పాటు అన్ని జిల్లాల్లో మంత్రివర్గంతోసహా తానే స్వయంగా వచ్చి.. ప్రజాదర్బారులు పెట్టి పోడుభూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. హుజూర్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. చాలా సిమెంట్ ఫ్యాక్టరీలున్న నేపథ్యంలో, కేంద్రంతో మాట్లాడి ఈఎస్‌ఐ దవాఖాన మంజూరుచేయిస్తామని చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటుచేస్తామని తెలిపారు. మేళ్లచెరువువంటి ప్రాంతాలను కలిపి ఇక్కడే కోర్టును ఏర్పాటుచేసేందుకు హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో మాట్లాడుతానని తెలిపారు. వీలైనంత త్వరలో ఎక్కువమొత్తంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంజూరుచేస్తామన్నారు. పాత నల్లగొండ జిల్లాలో ఇరిగేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తానని హామీ ఇచ్చారు.

Full View

Tags:    

Similar News