తెలంగాణలో ఎన్నికల హీట్ పెంచనున్న బీజేపీ
BJP: ఇవాళ బీజేపీ పదాధికారుల సమావేశం
తెలంగాణలో ఎన్నికల హీట్ పెంచనున్న బీజేపీ
BJP: తెలంగాణలో ఎన్నికల హీట్ స్టార్ట్ అయింది. అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సభలకు ప్లాన్ చేస్తోంది. అటు తెలంగాణ బీజేపీ సైతం కౌంటర్ సభలు నిర్వహించాలని ప్రణాళికలు చేస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ పదాధికారుల సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పార్టీ కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరగనుంది.
ప్రస్తుతం తెలంగాణలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్ విమోచన దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యాచరణ, రాష్ట్ర పార్టీ సన్నద్ధమవుతున్న తీరు తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యనేతలు దిశానిర్దేశం చేస్తారు.
గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా తెలంగాణ విమోచన దినోత్సవాలకు ప్లాన్ చేసింది బీజేపీ. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్‌లో బహిరంగ సభకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ సభకు కేంద్ర హోంమంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సభతోనే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు కమలనాథులు ప్రకటనలు చేస్తున్నారు. ఇక వరుస సభలతో రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెంచాలని భావిస్తోంది కమలం పార్టీ. హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాలతో హడావిడి పెంచడంతో కౌంటర్ సభలు పెట్టాలని బీజేపీ యోచిస్తోంది.
మరో వైపు బీజేపీ కార్యకర్తల్లో జోష్ నింపేందుకు నిజామాబాద్‌లో మోడీతో సభ నిర్వహించేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రధాని కార్యాలయం నుంచి క్లారిటీ రాకపోవడంతో వరుసగా వాయిదా వేసుకుంటున్నారు కమలనాథులు. దీంతో మరోసారి భారీ స్థాయిలో ప్రధానితో సభ నిర్వహించి ఎన్నికల హామీలను ప్రకటించాలనే వ్యూహం రచిస్తోంది బీజేపీ. మోడీ, అమిత్‌షా సభలు నిర్వహిస్తేనే వచ్చే ఎన్నికల్లో బీజేపీ బలపడుతుందనే వాదనలు ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.