ముగిసిన 26వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీ
26వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీ–2025 ముగింపు కార్యక్రమం శనివారం మౌలా–అలీ లోని ఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఘనంగా జరిగింది.
హైదరాబాద్: 26వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ పోటీ–2025 ముగింపు కార్యక్రమం శనివారం మౌలా–అలీ లోని ఆర్‌పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ సోనాలి మిశ్రా, జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గర్గ్, ఇంటెలిజెన్స్ బ్యూరో స్పెషల్ డైరెక్టర్ డా.మహేష్ దీక్షిత్, ఐజీ కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్ (SCR) అరోమా సింగ్ ఠాకూర్ తదితర సీనియర్ రైల్వే అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ, పోలీస్ బ్యాండ్లు క్రమశిక్షణ, ఐక్యత మరియు సాంస్కృతిక సమగ్రతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రశంసించారు. పోలీస్ బ్యాండ్లు, మార్షల్ మ్యూజిక్ బలగాలకు ప్రేరణనిచ్చి, దేశభక్తిని, దేశ రక్షణ పట్ల నిబద్ధతను పెంచుతాయని అన్నారు. దేశంలోని అన్ని పోలీస్ బలగాలు ప్రజల ఆశలను నెరవేర్చుతూ, అవసరంలో స్నేహితుడిలా నిజాయితీతో సేవలందించాల్సిన పవిత్ర బాధ్యత కలిగివున్నాయన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యుత్తమ ప్రణాళిక, ఆతిథ్యంతో విజయవంతంగా నిర్వహించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ను ఆయన అభినందించారు.
ఈ పోటీలో రాష్ట్ర పోలీస్ బలగాలు, కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, ఇతర యూనిఫాం సేవలకు చెందిన మొత్తం 24 బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 1307 మంది బ్యాండ్ సిబ్బంది (1083 పురుషులు, 224 మహిళలు) పాల్గొని, భారతదేశంలోని పోలీస్ బ్యాండ్ సంగీతం, ఆచార సంప్రదాయాలను ప్రదర్శించారు.
ముగింపు కార్యక్రమంలో కేంద్ర మంత్రి వివిధ విభాగాలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన బ్యాండ్లకు అవార్డులు, ట్రోఫీలను ప్రదానం చేశారు. సంగీత నైపుణ్యం, సమన్వయం, ఆచార క్రమశిక్షణలో అద్భుత ప్రతిభను గుర్తించి ఈ పురస్కారాలు అందజేశారు. అంతకు ముందు, పోలీస్ బ్యాండ్ పోటీ వివరాలను పొందుపరిచిన ఒక మ్యాగజైన్‌ను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ఆవిష్కరించారు.