Apple–Google Deal: యాపిల్–గూగుల్ కీలక ఒప్పందం.. జెమిని ఏఐతో యాపిల్ ఇంటెలిజెన్స్
Apple–Google Deal: యాపిల్, గూగుల్ మధ్య కీలక దీర్ఘకాలిక ఒప్పందం కుదిరింది. జెమిని ఏఐ, గూగుల్ క్లౌడ్ ఆధారంగా యాపిల్ ఇంటెలిజెన్స్, సిరి మరింత శక్తివంతం కానున్నాయి.
Apple–Google Deal: యాపిల్–గూగుల్ కీలక ఒప్పందం.. జెమిని ఏఐతో యాపిల్ ఇంటెలిజెన్స్
Apple–Google Strategic Deal: టెక్ రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రపంచ దిగ్గజ సంస్థలు యాపిల్, గూగుల్ మధ్య ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, యాపిల్ అభివృద్ధి చేస్తున్న తదుపరి తరం ‘ఫౌండేషన్ మోడల్స్’ ఇకపై గూగుల్ జెమిని (Gemini) ఏఐ మోడల్స్‌తో పాటు గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేయనున్నాయి.
ఈ భాగస్వామ్యం ద్వారా రాబోయే రోజుల్లో ‘యాపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్లు మరింత శక్తివంతంగా మారనున్నట్లు యాపిల్, గూగుల్ సంయుక్తంగా ప్రకటించాయి. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలకానున్న సిరి (Siri) అప్డేట్స్ ద్వారా వినియోగదారులకు మరింత వ్యక్తిగతమైన, సహజమైన సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు.
గూగుల్ ఏఐ టెక్నాలజీని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, తమ ఏఐ మోడల్స్‌కు అది అత్యంత సమర్థవంతమైన పునాదిగా ఉపయోగపడుతుందని యాపిల్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ కొత్త సాంకేతిక భాగస్వామ్యం యాపిల్ వినియోగదారులకు పూర్తిగా కొత్త అనుభవాన్ని అందిస్తుందని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది.
అయితే, యాపిల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన డేటా ప్రాసెసింగ్ యథావిధిగా యాపిల్ పరికరాలు మరియు ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ ద్వారానే జరుగుతుందని కంపెనీ స్పష్టం చేసింది. దీని ద్వారా వినియోగదారుల గోప్యతకు అత్యున్నత భద్రత కొనసాగుతుందని యాపిల్ వెల్లడించింది.