Vaibhav Suryavanshi : బిహార్ కుర్రాడి దెబ్బకి టాప్ స్టార్లకు షాక్.. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చ్‌లో ఆరో స్థానం
కేవలం 14 ఏళ్ల వయసులోనే బిహార్‌లోని తాజ్‌పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచాన్ని తన ఆటతో అబ్బురపరిచాడు.
Vaibhav Suryavanshi : బిహార్ కుర్రాడి దెబ్బకి టాప్ స్టార్లకు షాక్.. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సెర్చ్‌లో ఆరో స్థానం
Vaibhav Suryavanshi : కేవలం 14 ఏళ్ల వయసులోనే బిహార్‌లోని తాజ్‌పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చిన వైభవ్ సూర్యవంశీ.. క్రికెట్ ప్రపంచాన్ని తన ఆటతో అబ్బురపరిచాడు. తొలి బంతికి సిక్సర్ కొట్టడం, అతి తక్కువ వయసులో సెంచరీ చేయడం, లేదా ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టడం వంటి రికార్డులతో వార్తల్లో నిలిచాడు. మైదానంలో బ్యాట్‌తో సంచలనాలు సృష్టించిన ఈ యువ సంచలనం ఇప్పుడు గూగుల్ సెర్చ్‌లో కూడా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటాడు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా గూగుల్‌లో అత్యధికంగా ట్రెండ్ అయిన వ్యక్తుల జాబితాలో వైభవ్ సూర్యవంశీ టాప్-10 లో నిలిచాడు. ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడు అతనే కావడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా టాప్-10లో ఏకైక భారతీయుడు
ప్రతి సంవత్సరంలాగే, గూగుల్ ఈ డిసెంబర్‌లో కూడా అత్యంత పాపులర్ ట్రెండ్‌లు, సెర్చ్‌ల జాబితాను విడుదల చేసింది. గత కొన్నేళ్లుగా భారతదేశం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, షారుక్ ఖాన్ వంటి పెద్ద స్టార్లు ఈ జాబితాలో స్థానం పొందేవారు. కానీ ఈసారి వీరందరినీ దాటుకొని యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేయబడిన వ్యక్తుల గ్లోబల్ లిస్ట్‌లో భారతదేశం నుంచి వైభవ్ సూర్యవంశీ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో కండ్రిక్ లమార్, జిమ్మీ కిమ్మెల్, జోహ్రాన్ మమదాని, గ్రెటా థన్‌బర్గ్ వంటి ప్రముఖులు ఉన్నారు. వీరి మధ్య వైభవ్ సూర్యవంశీ నంబర్-1 భారతీయుడిగా నిలవడం మనందరికీ గర్వకారణం.
ఇతర భారతీయ అథ్లెట్లు
గూగుల్ ఇండియా విడుదల చేసిన అత్యధికంగా ట్రెండ్ అయిన భారతీయ అథ్లెట్ల జాబితాలో కూడా వైభవ్‌కు నంబర్-1 స్థానం దక్కింది. అయితే ఈ లిస్ట్‌లో వైభవ్ తర్వాత స్థానంలో.. అతనిలాగే దూకుడుగా ఆడి ఐపీఎల్ 2025లో హిట్ అయిన ప్రియాన్ష్ ఆర్య రెండో స్థానంలో నిలిచాడు. భారత జట్టులో సంచలనం సృష్టించిన అభిషేక్ శర్మ మూడో స్థానంలో ఉండగా, యువ వికెట్ కీపర్ షేక్ రషీద్ నాల్గో స్థానంలో, భారత్‌కు తొలిసారిగా మహిళల వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఐదో స్థానంలో నిలిచింది.