IND vs NZ : వరల్డ్ కప్ ముందు భారత్‌కు డేంజర్ సిగ్నల్స్..నాలుగో టీ20 ఓటమికి 4 ముఖ్య కారణాలివే
వరల్డ్ కప్ ముందు భారత్‌కు డేంజర్ సిగ్నల్స్..నాలుగో టీ20 ఓటమికి 4 ముఖ్య కారణాలివే
IND vs NZ : విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. అయితే కివీస్ బ్యాటర్లు ఆది నుంచే విరుచుకుపడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్య ఛేదనలో టీమిండియా తడబడి 18.4 ఓవర్లలోనే 165 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు పూర్తిగా తేలిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
1. టాప్ ఆర్డర్ వైఫల్యం: భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఓపెనర్లు మంచి పునాది వేయాలి. కానీ యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ ఎదుర్కొన్న మొదటి బంతికే గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం జట్టును కోలుకోలేని దెబ్బ తీసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం కేవలం 8 పరుగులు చేసి నిరాశపరిచాడు. పవర్ ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో పడిపోయింది. ఆరంభంలోనే వికెట్లు పడటం వల్ల బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడలేకపోయారు.
2. హార్దిక్ పాండ్యా ఫ్లాప్ షో: టీమిండియాకు ఫినిషర్‌గా, నమ్మదగ్గ మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా పేరున్న హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. 5 బంతులు ఆడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఒకవైపు శివమ్ దూబే సిక్సర్లతో విరుచుకుపడుతున్నా, అతనికి సహకారం అందించే మరో బ్యాటర్ లేకపోవడం భారత్ ఓటమికి ప్రధాన కారణమైంది. హార్దిక్ వంటి అనుభవం ఉన్న ఆటగాడు కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం జట్టు విజయవకాశాలను దెబ్బతీసింది.
3. బౌలర్ల ధారాళత్వం: న్యూజిలాండ్ బ్యాటర్ల ధాటికి భారత బౌలర్లు బెంబేలెత్తారు. ముఖ్యంగా యంగ్ బౌలర్ హర్షిత్ రాణా తన 4 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకున్నాడు. అతని ఎకానమీ 13.50గా నమోదైంది. నమ్మదగ్గ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా వికెట్లు తీయలేక 38 పరుగులు ఇచ్చాడు. స్పిన్నర్ రవి బిష్ణోయ్ 49 పరుగులు ధారబోశాడు. కివీస్ జట్టు పవర్ ప్లేలోనే 71 పరుగులు సాధించిందంటే భారత బౌలింగ్ ఎంత పేలవంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.
4. జట్టు బ్యాలెన్సింగులో లోపం: ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఐదుగురు బౌలర్లను మాత్రమే నమ్ముకుంది. మంచు ప్రభావం ఎక్కువగా ఉన్న సమయంలో ఆరో బౌలర్ లేకపోవడం భారత్‌కు శాపంగా మారింది. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబేలు అందుబాటులో ఉన్నా వారిని బౌలింగ్‌లో వాడుకోకపోవడం మేనేజ్‌మెంట్ వైఫల్యంగా కనిపిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ స్పిన్నర్లు శాంట్నర్, సోధి మధ్య ఓవర్లలో వికెట్లు తీసి రన్ రేట్‌ను కట్టడి చేశారు. కానీ భారత స్పిన్నర్లు మాత్రం కివీస్ బ్యాటర్లను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు.