T20 World Cup 2026: నేడు అమెరికాతో మ్యాచ్.. సంజూకు షాక్, భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 వరల్డ్‌కప్‌ 2026 నేటి నుంచే ఆరంభం కానుంది.

Update: 2026-02-07 05:21 GMT

T20 World Cup 2026: నేడు అమెరికాతో మ్యాచ్.. సంజూకు షాక్, భారత్ ప్లేయింగ్ 11 ఇదే!

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. టీ20 వరల్డ్‌కప్‌ 2026 నేటి నుంచే ఆరంభం కానుంది. మొదటి రోజే మూడు మ్యాచ్‌లు జరగనున్నాయి. అందులో టీమిండియా మ్యాచ్ కూడా ఉంది. భారత్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని అమెరికా (యూఎస్ఏ) జట్టుతో ప్రారంభించనుంది. ఈ మ్యాచ్ ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి 7:00 గంటలకు ప్రారంభం కానుంది. అయితే శుక్రవారం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు భారత్ ప్లేయింగ్ 11పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓపెనర్ ఎవరనే ప్రశ్నకు.. ఇషాన్ కిషన్ అని సూటిగా చెప్పేశాడు.

యూఎస్ఏతో మ్యాచ్‌కు భారత జట్టు దూకుడు కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోంది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ బరిలోకి దిగనున్నారు. ఈ ఇద్దరు న్యూజీలాండ్ సిరీస్‌లో ఇరగదీసిన విషయం తెలిసిందే. అభిషేక్ మెరుపు ఆరంభాలు ఇస్తుండడంతో భారత్ భారీ స్కోర్ చేస్తోంది. ఇక ఇషాన్ ఏకంగా సెంచరీతో చెలరేగాడు. తిలక్ వర్మ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన అతడు.. అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. మెగా టోర్నీలో కూడా అదే ప్రదర్శన చేస్తాడని కెప్టెన్, కోచ్ నమ్మకంగా ఉన్నారు. దాంతో సంజూకు నిరాశే ఎదురుకానుంది. మూడో స్థానంలో తిలక్ వర్మ, నాలుగో స్థానంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నారు. గాయం నుంచి కోలుకున్న తిలక్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో బాగా ఆడాడు. సూర్య కూడా కివీస్ సిరీస్‌లో చెలరేగాడు. అనంతరం ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అనుభవం జట్టుకు బలంగా నిలవనుంది.

డెత్ ఓవర్లలో రన్స్ వరద పారించేందుకు రింకు సింగ్, శివమ్ దూబేలు ఉన్నారు, ఈ ఇద్దరిపై భారీ ఆశలున్నాయి. ఇటీవలి కాలంలో తమ పవర్ హిట్టింగ్‌తో మ్యాచ్‌లను తిప్పేసిన ఈ ఇద్దరూ.. భారత్ స్కోరును పరుగులు పెట్టించే సామర్థ్యం కలవారు. బౌలింగ్ విభాగంలో భారత్ పూర్తి సమతుల్యతతో కనిపిస్తోంది. స్పిన్ బాధ్యతలను అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి భుజాన వేసుకోనుండగా.. పేస్ విభాగానికి జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ అండగా ఉన్నారు. వాంఖడే పిచ్‌పై ఈ బౌలింగ్ కాంబో సరిగ్గా సరిపోతుంది. ఏ ఇద్దరు రాణించినా ప్రత్యర్థికి కఠిన పరీక్షగా మారనుంది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

Tags:    

Similar News