T20 World Cup 2026 : నాలుగు జట్లు.. రెండు సెమీఫైనల్స్.. వరల్డ్ కప్ క్లైమాక్స్ మొదలైంది
నాలుగు జట్లు.. రెండు సెమీఫైనల్స్.. వరల్డ్ కప్ క్లైమాక్స్ మొదలైంది
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన కీలక పోరులో టీమిండియా 5 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత్ అధికారికంగా సెమీఫైనల్‌లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌లో కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ 97 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చడమే కాకుండా, సెమీస్ బెర్తును ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో ఈ మెగా టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది.
ఈసారి సెమీఫైనల్ రేసులో నిలిచిన నాలుగు జట్లు ఇవే.. భారత్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్. సూపర్-8 దశలో గ్రూప్-1 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్లు ముందంజ వేయగా.. గ్రూప్-2 నుంచి ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్ టికెట్ దక్కించుకున్నాయి. ఇందులో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు తమ తమ గ్రూపుల్లో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించాయి. ఇక న్యూజిలాండ్ విషయానికొస్తే.. సూపర్-8 మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంకపై 65 పరుగుల భారీ తేడాతో గెలవలేకపోవడంతో కివీస్‌కు మార్గం సుగమమైంది.
షెడ్యూల్ ప్రకారం, మొదటి సెమీఫైనల్ పోరు మార్చి 4న దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఇక కోట్లాది మంది భారత అభిమానులు ఎదురుచూస్తున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5న జరగనుంది. ఇందులో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖెడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంగ్లాండ్‌ను ఓడించి ఫైనల్‌కు వెళ్లాలని సూర్య సేన పట్టుదలతో ఉంది.
సెమీఫైనల్‌లో గెలిచిన రెండు జట్లు మార్చి 8న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఫైనల్‌లో తలపడతాయి. ఈసారి భారత్ కనుక కప్పు గెలిస్తే చరిత్ర సృష్టించినట్లే. ఎందుకంటే టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలవలేదు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్, ఈ ఘనత సాధించి ప్రపంచ క్రికెట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తోంది.