Kavya Maran Celebration: సన్‌రైజర్స్ ‘హ్యాట్రిక్’ విజయం.. దక్షిణాఫ్రికా గడ్డపై కావ్య మారన్ సేన జోరు.. మూడోసారి టైటిల్ కైవసం!
Kavya Maran Celebration: SA20 లీగ్ ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ సంచలన విజయం. ప్రిటోరియా క్యాపిటల్స్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన కావ్య మారన్ సేన. స్టేడియంలో స్టెప్పులేసిన కావ్య పాప.. వైరల్ అవుతున్న సెలబ్రేషన్స్.
Kavya Maran Celebration: సన్‌రైజర్స్ ‘హ్యాట్రిక్’ విజయం.. దక్షిణాఫ్రికా గడ్డపై కావ్య మారన్ సేన జోరు.. మూడోసారి టైటిల్ కైవసం!
Kavya Maran Celebration: దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ఎస్ఏ20 (SA20) లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SEC) అజేయ శక్తిగా అవతరించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ పోరులో ప్రిటోరియా క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్, నాలుగేళ్లలో మూడోసారి ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.
ఉత్కంఠభరిత పోరు - స్టబ్స్ వీరోచిత పోరాటం: మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు, డెవాల్డ్ బ్రెవిస్ (101) మెరుపు సెంచరీతో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం 159 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ (63*), మాథ్యూ బ్రీట్జ్‌కే (68*) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, మరో 4 బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు.
స్టేడియంలో కావ్య మారన్ సందడి: జట్టు విజయం ఖరారు కావడంతో సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. స్టాండ్స్‌లో ఆమె గెంతుతూ, తన జట్టు సాధించిన మూడవ టైటిల్‌ను సూచిస్తూ వేళ్లతో '3' అని చూపిస్తూ చేసిన సంబరాలు హైలైట్‌గా నిలిచాయి. ఐపీఎల్‌లో ఫలితాలు ఎలా ఉన్నా, సౌత్ ఆఫ్రికా లీగ్‌లో మాత్రం కావ్య మారన్ అత్యంత విజయవంతమైన ఓనర్‌గా నిలవడం విశేషం.
కెప్టెన్ ఆనందం: "ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా ఉండటమే మా విజయాన్ని నిర్ణయించింది. 16వ ఓవర్ తర్వాత మ్యాచ్ మా వైపు తిరిగింది" అని విజేత కెప్టెన్ స్టబ్స్ పేర్కొన్నారు. మొత్తానికి సౌత్ ఆఫ్రికాలో సన్‌రైజర్స్ విజయ పరంపర కొనసాగుతుండటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.