Shivam Dube : వైజాగ్ లో సిక్సర్ల జాతర..15 బంతుల్లోనే ఫిఫ్టీ..ఒకే ఓవర్లో 29 పరుగులు..దూబే ఊచకోత

వైజాగ్ లో సిక్సర్ల జాతర..15 బంతుల్లోనే ఫిఫ్టీ..ఒకే ఓవర్లో 29 పరుగులు..దూబే ఊచకోత

Update: 2026-01-29 01:03 GMT

Shivam Dube : విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం శివమ్ దూబే విధ్వంసానికి వేదికైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్, కేవలం 63 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైన వేళ.. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. క్రీజులోకి రాగానే ఎదుర్కొన్న మొదటి బంతినే 101 మీటర్ల భారీ సిక్సర్‌గా మలచి తన ఉద్దేశాన్ని చాటాడు.

దూబే తన ఇన్నింగ్స్‌లో సిక్సర్లనే నమ్ముకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. యువరాజ్ సింగ్ (12 బంతులు), అభిషేక్ శర్మ (14 బంతులు) మాత్రమే అతని కంటే ముందున్నారు. మొత్తం 23 బంతులు ఎదుర్కొన్న దూబే.. 3 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 65 పరుగులు చేశాడు. అయితే దురదృష్టవశాత్తూ రనౌట్ రూపంలో వెనుదిరగడంతో అతని మెరుపు ఇన్నింగ్స్‌కు తెరపడింది.

న్యూజిలాండ్ వెటరన్ స్పిన్నర్ ఈష్ సోధి వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో దూబే తనలోని అసలైన విశ్వరూపాన్ని చూపించాడు. ఆ ఓవర్లో దూబే వరసగా 2, 4, 6, 4, 6, 6 బాదడంతో పాటు ఒక వైడ్ రావడంతో మొత్తం 29 పరుగులు వచ్చాయి. సోధిని టార్గెట్ చేస్తూ స్టేడియం నలుమూలల బంతిని తరలించిన దూబే, ఆ ఓవర్ ముగిసేసరికి కివీస్ టీమ్‌ను ఆత్మరక్షణలో పడేశాడు. కివీస్ కెప్టెన్ కూడా దూబే హిట్టింగ్‌కు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నాడు.

దూబే ఇన్నింగ్స్‌లో హైలైట్ ఏమిటంటే అతని సిక్సర్ల రేంజ్. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సిద్ధహస్తుడైన ఈ లెఫ్ట్ హ్యాండర్, లాంగ్ ఆన్, మిడ్ వికెట్ దిశగా కొట్టిన సిక్సర్లు అభిమానులను కనువిందు చేశాయి. జట్టు స్కోరును వంద దాటించడంలో కీలక పాత్ర పోషించిన దూబే, తాను మంచి ఫామ్‌లో ఉన్నానని నిరూపించుకున్నాడు. అయితే దూబే పోరాటం వృథా చేస్తూ మిగిలిన బ్యాటర్లు విఫలం కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. టీమిండియా ఓడినా, దూబే ఆడిన ఈ ఇన్నింగ్స్ మాత్రం టీ20 చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది.

Tags:    

Similar News