WPL 2026 Prize Money : మరోసారి డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ..మంధాన సేన పై కోట్ల వర్షం
మరోసారి డబ్ల్యూపీఎల్ ఛాంపియన్‌గా ఆర్సీబీ..మంధాన సేన పై కోట్ల వర్షం
WPL 2026 Prize Money : వడోదరలోని కోటంబి స్టేడియంలో జరిగిన మహిళల ప్రిమియర్ లీగ్ 2026 ఫైనల్ పోరు క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచింది. ఈ హోరాహోరీ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండోసారి టైటిల్‌ను ముద్దాడింది. కేవలం కప్పు గెలవడమే కాదు, స్మృతి మంధాన సేన భారీ ప్రైజ్ మనీతో కోటీశ్వరులైంది. రికార్డు స్థాయి పరుగుల ఛేదనతో ఆర్‌సీబీ చరిత్ర సృష్టిస్తే, ఢిల్లీ వరుసగా నాలుగోసారి ఫైనల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది.
డబ్ల్యూపీఎల్ 2026 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బీసీసీఐ ఏకంగా రూ.6 కోట్ల భారీ నగదు బహుమతిని అందించింది. 2024 తర్వాత ఆర్‌సీబీకి ఇది రెండో టైటిల్. ఇక వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరినా టైటిల్ గెలవలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రన్నరప్‌గా రూ.3 కోట్లు దక్కాయి. గత మూడు సీజన్ల నుంచి ఇదే ప్రైజ్ మనీ స్ట్రక్చర్‌ను కొనసాగిస్తున్నారు. ముంబై ఇండియన్స్ కూడా గతంలో రెండుసార్లు టైటిల్ గెలిచి ఇదే మొత్తాన్ని అందుకుంది. ఇప్పుడు ఆర్‌సీబీ కూడా రెండు టైటిళ్లతో ముంబై సరసన నిలిచింది.
ఆరెంజ్, పర్పుల్ క్యాప్ ఎవరికి?
టీమ్ ప్రైజ్ మనీతో పాటు వ్యక్తిగత ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు కూడా భారీగా సంపాదించారు.
ఆరెంజ్ క్యాప్ : ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన 377 పరుగులతో టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచి రూ.5 లక్షలు గెలుచుకుంది.
పర్పుల్ క్యాప్ : గుజరాత్ జెయింట్స్ స్టార్ సోఫీ డివైన్ 17 వికెట్లతో అత్యధిక వికెట్ల వీరురాలిగా నిలిచి రూ.5 లక్షలు దక్కించుకుంది.
మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ : సోఫీ డివైన్ అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శనకు రూ.5 లక్షల నగదు బహుమతి లభించింది.
ఎమర్జింగ్ ప్లేయర్: ఢిల్లీ క్యాపిటల్స్ యువ సంచలనం నందిని శర్మకు రూ.5 లక్షలు అందజేశారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (ఫైనల్): ఫైనల్లో 87 పరుగులతో చెలరేగిన స్మృతి మంధానకు రూ.2.5 లక్షలు దక్కాయి.
రికార్డు ఛేదనతో ఆర్‌సీబీ వీరవిహారం
ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ 203 పరుగుల భారీ స్కోరు సాధించినా, ఆర్‌సీబీ బ్యాటర్లు భయపడలేదు. స్మృతి మంధాన (87), జార్జియా వోల్ (79) వీరోచిత పోరాటంతో ఆర్‌సీబీ 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలోనే ఫైనల్లో ఇంతటి భారీ స్కోరును ఛేజ్ చేయడం ఇదే తొలిసారి. ఆఖరి ఓవర్లో రాధా యాదవ్ వరుస ఫోర్లతో మ్యాచ్‌ను ముగించి స్టేడియాన్ని హోరెత్తించింది. ఈ విజయంతో ఆర్‌సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.