Yuvraj Singh: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు.. ఈడీ విచారణకు హాజరైన యువరాజ్ సింగ్
Yuvraj Singh: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు.
Yuvraj Singh: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం అతడు దిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయానికి వచ్చారు. ఇదే కేసులో ఇంతకుముందు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ అన్వేషి జైన్ కూడా ఈడీ ముందు హాజరయ్యారు.
ఈ కేసులో భాగంగా గతంలోనే పలువురు ప్రముఖులను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్, రాబిన్ ఉతప్పతో పాటు, నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి, బెంగాలీ నటుడు అంకుష్ హజ్రా వాంగ్మూలాలను కూడా దర్యాప్తు సంస్థ నమోదు చేసింది. ఈడీ సమన్లు జారీ చేయడంతో బాలీవుడ్ నటుడు సోనూసూద్ బుధవారం (సెప్టెంబర్ 24) విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ ప్రముఖులంతా 1xBet అనే బెట్టింగ్ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించారు. ఈ అక్రమ బెట్టింగ్ యాప్ ద్వారా అనేకమందిని లూటీ చేసినట్లు, కోట్లాది రూపాయల పన్నులు ఎగవేసినట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. 1xBet వెబ్‌సైట్ ప్రకారం, ఈ కంపెనీ గత 18 సంవత్సరాలుగా బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. స్పోర్ట్స్ ఈవెంట్లలో పందెం కాసి భారీగా డబ్బులు గెలుచుకోవచ్చని ఇది ప్రచారం చేసుకుంటుంది. ఈ యాప్ 70 భాషల్లో అందుబాటులో ఉండటం గమనార్హం. ఇటీవల పార్లమెంట్ రియల్ మనీ ఆన్‌లైన్ గేమింగ్‌ను నిషేధించింది.