T20 World Cup Final: ఆ సెంటిమెంట్ ఎక్కడో తేడా కొడుతుంది శీనా..!
T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది! రేపు అహ్మదాబాద్‌లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య మహా సంగ్రామం. అహ్మదాబాద్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి టీమిండియా కప్పు కొడుతుందా? అనేది ఈరోజు తేలిపోనుంది.
T20 World Cup Final: ఆ సెంటిమెంట్ ఎక్కడో తేడా కొడుతుంది శీనా..!
Ahmedabad Cricket Stadium: క్రికెట్ ప్రపంచం మరో హైవోల్టేజ్ డ్రామాకు వేదికవుతోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం మరోసారి విశ్వవిజేతను నిర్ణయించడానికి సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ తుదిపోరులో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా, మిచెల్ శాంట్నర్ సారథ్యంలోని న్యూజిలాండ్‌తో తలపడనుంది. సెమీఫైనల్స్‌లో అద్భుత ఫామ్ కనబరిచిన కివీస్ జట్టు ఒకవైపు, టోర్నీ ఆసాంతం పోరాటపటిమతో ఫైనల్‌కు దూసుకొచ్చిన భారత్ మరోవైపు.. టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతున్నాయి.
అహ్మదాబాద్ సెంటిమెంట్.. అభిమానుల ఆందోళన
ఈ మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో ఒకవైపు ఉత్కంఠ ఉంటే, మరోవైపు గూడుకట్టుకున్న ఆందోళన కనిపిస్తోంది. కారణం ..అహ్మదాబాద్ వేదికపై ఐసీసీ టోర్నీలలో భారత్ ట్రాక్ రికార్డు. గత 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో ఓటమి ఎరుగని భారత్‌కు షాక్ ఇచ్చిన వేదిక ఇదే. అంతేకాదు, తాజా టోర్నీలో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఎదుర్కొన్న ఓటమి కూడా అహ్మదాబాద్‌లోనే జరిగింది. 2023 నుంచి ఇప్పటివరకు టీమిండియా ఐసీసీ టోర్నీలలో ఓడిపోయిన రెండు మ్యాచులు ఈ స్టేడియంలోనే జరగడం, ఫ్యాన్స్‌ను ఈసారి చరిత్ర మారుతుందా? అన్న ఆలోచనలో పడేలా చేస్తోంది. సెంటిమెంట్లను పక్కనపెట్టి టీమిండియా తన అద్భుత ప్రదర్శనతో ఈ అహ్మదాబాద్ శాపాన్ని ఎలా చెరిపేస్తుందో చూడాలి.
బుమ్రా ముప్పు .. శాంట్నర్ భయం
మరోవైపు, న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ప్రత్యర్థి బలంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "టీమిండియాలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా నుంచి మాకు అతిపెద్ద సవాల్ ఎదురుకానుంది. అతను మ్యాచ్ గమనాన్ని మార్చగలడు" అని శాంట్నర్ ఒప్పుకున్నాడు. అయితే, కేవలం బుమ్రాను చూసి భయపడితే సరిపోదని, భారత్‌లోని ప్రతి ఆటగాడు ఏ క్షణంలోనైనా ప్రమాదకరంగా మారగలడని ఆయన హెచ్చరించాడు. భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్ బాధ్యత తీసుకుని గెలిపించడం వారి బలం,అని శాంట్నర్ పేర్కొన్నాడు.
కివీస్ జట్టు క్రమశిక్షణతో కూడిన ఆటతీరుకు మారుపేరు. అటు టీమిండియా సొంతగడ్డపై మద్దతుతో జోరు మీదుంది. బుమ్రా వేసే యార్కర్లు, కివీస్ బ్యాటర్ల సంయమనం మధ్య సాగే ఈ పోరులో చివరికి ఎవరు విజేతగా నిలుస్తారు? అనేది రేపు తేలనుంది. అహ్మదాబాద్ స్టేడియం మళ్లీ విషాదాన్ని మిగిలిస్తుందా లేక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుందా? అభిమానులందరి కళ్లు రేపటి మ్యాచ్‌పైనే.