Abhishek Sharma: అభిషేక్ శర్మపై టీమిండియా సంచలన ప్రకటన
Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అభిషేక్ శర్మ ఆడటంపై ఉత్కంఠ నెలకొంది. పేలవ ఫామ్‌లో ఉన్నప్పటికీ గౌతమ్ గంభీర్ అతడిని ఎందుకు సమర్థిస్తున్నారు? న్యూజిలాండ్‌తో జరిగే మహా సంగ్రామంలో టీమిండియా వ్యూహం ఏంటి?
Abhishek Sharma: అభిషేక్ శర్మపై టీమిండియా సంచలన ప్రకటన
T20 World Cup: క్రికెట్ అంటేనే అనిశ్చితి.. ఇక్కడ రాత్రికి రాత్రే హీరోలు జీరోలు అవుతారు, జీరోలు హీరోలు అవుతారు. ప్రస్తుతం టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. ఐపీఎల్‌లో సిక్సర్ల వర్షం కురిపించి 'సెన్సేషన్' అనిపించుకున్న ఈ కుర్రాడు, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. వరుసగా మూడు సార్లు డకౌట్ కావడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఒక రేంజ్‌లో జరుగుతోంది.
విమర్శల సుడిగుండంలో అభిషేక్
ఈ టోర్నీలో అభిషేక్ శర్మ ప్రదర్శన గణంకాలు చూస్తే అభిమానుల ఆందోళన అర్థమవుతుంది. ఇప్పటివరకు కనీసం 100 పరుగులు కూడా దాటలేకపోయిన ఈ 'మహాత్ముడు', ఒకే ఒక్క అర్ధ సెంచరీ మినహా మిగతా మ్యాచ్‌ల్లో చేతులెత్తేశాడు. "ఐపీఎల్‌లో ఆడినంత ఈజీగా ఐసీసీ టోర్నీల్లో ఆడలేవు" అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మార్చి 8న న్యూజిలాండ్‌తో జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్‌లో అతడిని పక్కన పెట్టాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
గంభీర్ మార్క్ ప్లాన్..
అభిమానులు ఒకలా ఆలోచిస్తుంటే, టీమ్ మేనేజ్మెంట్ మాత్రం మరోలా ఆలోచిస్తోంది. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని 'గంభీర్ గ్యాంగ్' అభిషేక్ శర్మపై గట్టి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. పీటీఐ (PTI) నివేదికల ప్రకారం.. ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లో విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చడం సరికాదని మేనేజ్మెంట్ భావిస్తోంది. అభిషేక్ శర్మ ఒక్కసారి క్లిక్ అయితే ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించగలడని, ఆ 'ఎక్స్ ఫ్యాక్టర్' కోసమే అతనికి తుది జట్టులో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
సంజు శాంసన్ మద్దతు..
అభిషేక్ ఫామ్‌పై టీమ్ సభ్యులు కూడా సానుకూలంగా ఉన్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ సైతం అభిషేక్ శర్మపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పెద్ద మ్యాచ్‌ల్లో అభిషేక్ వంటి ప్లేయర్లు చెలరేగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా, ఇప్పుడు ఈ ఒక్క మార్పు చేసి అనవసర రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.
ఫైనల్ పోరు
మార్చి 8వ తేదీన జరగబోయే ఈ మహా సంగ్రామంలో అందరి కళ్లు అభిషేక్ శర్మపైనే ఉన్నాయి. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెబుతాడా? లేక మరోసారి నిరాశపరుస్తాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. గంభీర్ పెట్టుకున్న నమ్మకాన్ని అభిషేక్ నిలబెట్టుకుంటే, టీమిండియా ఖాతాలో మరో ప్రపంచకప్ చేరడం ఖాయం.