Lord's Test : రాహుల్ రికార్డును అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన జో రూట్
Lord's Test : ఇంగ్లాండ్ రన్ మిషన్ జో రూట్ లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడమే కాకుండా, ఫీల్డింగ్‌లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచే పని చేశాడు.
Lord's Test : రాహుల్ రికార్డును అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన జో రూట్
Lord's Test : ఇంగ్లాండ్ రన్ మిషన్ జో రూట్ లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడమే కాకుండా, ఫీల్డింగ్‌లో కూడా అందరినీ ఆశ్చర్యపరిచే పని చేశాడు. జో రూట్ భారత బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఈ క్యాచ్‌ను రూట్ స్లిప్‌లో ఒక చేత్తో పట్టుకున్నాడు. ఈ క్యాచ్ ద్వారా కరుణ్ నాయర్ అవుట్ అవ్వడమే కాకుండా, జో రూట్ ఒక ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. ఈ రికార్డు మరెవరిదో కాదు, భారత దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ ది.
కరుణ్ నాయర్ క్యాచ్‌ను అందుకోవడం ద్వారా జో రూట్, రాహుల్ ద్రావిడ్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లను అందుకున్న ఫీల్డర్‌గా జో రూట్ నిలిచాడు. జో రూట్ ఖాతాలో ఇప్పుడు 211 క్యాచ్‌లు ఉన్నాయి. రాహుల్ ద్రావిడ్ 210 క్యాచ్‌లను అందుకున్నాడు. ఫీల్డర్‌గా టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన వారిలో మహేల జయవర్ధనే 205 క్యాచ్‌లతో మూడో స్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్ 200 క్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
జో రూట్ కేవలం క్యాచ్‌ల విషయంలోనే కాదు సెంచరీల విషయంలో కూడా రాహుల్ ద్రావిడ్‌ను అధిగమించాడు. జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో ఇప్పుడు 37 సెంచరీలు సాధించగా, రాహుల్ ద్రావిడ్ టెస్ట్‌లో 36 సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం జో రూట్ కంటే ఎక్కువ సెంచరీలు సాధించిన వారిలో కుమార్ సంగక్కర(38), రికీ పాంటింగ్(41), జాక్ కల్లిస్(45), సచిన్ టెండూల్కర్(51) ఉన్నారు.
జో రూట్ అద్భుతమైన సెంచరీ
లార్డ్స్ టెస్ట్‌లో ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 387 పరుగులు చేసింది. ఇందులో జో రూట్ దే అత్యధిక సహకారం. జో రూట్ 199 బంతుల్లో 104 పరుగులు చేశాడు. తన బ్యాట్ నుండి 10 బౌండరీలు వచ్చాయి. ఓలీ పోప్, బెన్ స్టోక్స్ తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టు పెద్ద స్కోరుకు చేరడానికి సహాయపడ్డాడు. రూట్ మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌లో అదరగొడితే, బౌలింగ్‌లో జస్ ప్రీత్ బుమ్రా తన సత్తా చాటాడు. బుమ్రా ఐదు వికెట్లు తీసి, భారత్ తరపున విదేశాల్లో అత్యధిక ఐదు వికెట్ల ప్రదర్శనల రికార్డును సాధించాడు. దీంతో బుమ్రా పేరు లార్డ్స్ గౌరవ బోర్డులో నమోదైంది.