IND vs NZ 4th T20: విశాఖ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా.. డబుల్ రేట్లకు అమ్ముతున్న కేటుగాళ్లు!
IND vs NZ 4th T20: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
IND vs NZ 4th T20: విశాఖ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ల దందా.. డబుల్ రేట్లకు అమ్ముతున్న కేటుగాళ్లు!
IND vs NZ 4th T20: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియం స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ మొదలవనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కొందరు ఫాన్స్ స్టేడియంకు చేరుకున్నారు. క్రికెట్ మ్యాచ్‌ను ఆసక్తిగా వీక్షించేందుకు అభిమానులు భారీగా తరలివస్తుండటంతో.. ఈ అవకాశాన్ని దుండగులు తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాల్లో కొందరు బ్లాక్ టికెట్ దందాకు పాల్పడ్డారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన టికెట్లను రెట్టింపు ధరలకు బ్లాక్‌లో విక్రయించారు. విషయం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి.. బ్లాక్ టికెట్ దందా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు.
రూ.1,200, రూ.2,500 ధర ఉన్న టికెట్లను రెట్టింపు రేట్లకు కేటుగాళ్లు విక్రయిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి మొత్తం 20 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. టికెట్ల కోసం అభిమానులు ఇబ్బందులు పడుతుంటే.. బ్లాక్ టికెట్ల దందాతో కొందరు అక్రమంగా లాభాలు పొందుతున్నారని పోలీసులు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్రికెట్ అభిమానులు బ్లాక్ టికెట్లను కొనుగోలు చేయకుండా.. అధికారిక మార్గాల ద్వారానే టికెట్లు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ఈ ఘటనతో బ్లాక్ టికెట్ల దందాపై మరోసారి చర్చ మొదలైంది. మ్యాచ్ రోజుల్లో స్టేడియం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసి.. అక్రమ టికెట్ విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
టీ20 సిరీస్‌ను భారత్ 3-0తో ఇప్పటికే కైవసం చేసుకుంది. విశాఖలో కూడా గెలిచి మరింత ఆధిక్యంలోకి వెళ్లాలని టీమిండియా చూస్తోంది. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా టీ20 వరల్డ్‌కప్ 2026ను దృష్టిలో పెట్టుకుని హార్దిక్ ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది. అతడి స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఆడనున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు ఆడని శ్రేయాస్‌కు ఇది మంచి ఛాన్స్. చివరి రెండు టీ20ల్లో రాణిస్తే.. టీ20 ప్రపంచకప్లో చోటు దక్కే అవకాశాలు లేకపోలేదు . మరోవైపు ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ విశాఖ టీ20లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఇక ఓపెనర్ సంజు శాంసన్ నేటి మ్యాచ్‌లో ఆడనున్నాడు. వరుస వైఫల్యాల తర్వాత సంజుకు మేనేజ్మెంట్ మరో అవకాశం ఇవ్వాలని బావిస్తోంది. 4, 5 టీ20 మ్యాచ్‌లలో బాగా ఆడితే.. మెగా టోర్నీలో తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశాలు మెరుగవుతాయి. మొదటి మూడు మ్యాచ్‌లలో సంజు తక్కువ పరుగులకే అవుట్ అయిన విషయం తెలిసిందే.