T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ అంచనాలు.. ఆ జట్టుకే మాజీల ఓటు!

T20 World Cup 2026: టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌పై స్పందించారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను సెమీఫైనలిస్టులుగా జంబో పేర్కొన్నారు.

Update: 2026-01-28 13:51 GMT

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ అంచనాలు.. ఆ జట్టుకే మాజీల ఓటు!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026కు సమయం ఆసన్నమవుతోంది. భారత్‌, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో పొట్టి ప్రపంచకప్‌పై క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. టోర్నీ ప్రారంభానికి ముందే సెమీఫైనల్‌కు చేరే జట్లపై మాజీ క్రికెటర్లు, నిపుణులు తమ అంచనాలను వెల్లడించారు. భారత క్రికెట్ దిగ్గజాలైన అనిల్ కుంబ్లే, ఇర్ఫాన్ పఠాన్, సురేశ్ రైనా సహా పలువురు మాజీ ఆటగాళ్లు సెమీఫైనల్స్‌కు వెళ్లే జట్లను అంచనా వేశారు. ఆసక్తికరంగా ప్రతి మాజీ ఆటగాడు టీమిండియా సెమీ ఫైనల్ చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.

టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌పై స్పందించారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లను సెమీఫైనలిస్టులుగా జంబో పేర్కొన్నారు. అనుభవం, సమతుల్య జట్టు కలయిక ఉన్న ఈ నాలుగు జట్లు సెమీ ఫైనల్ దశకు చేరుతాయని అభిప్రాయపడ్డారు. సంజయ్ బంగర్, చేటేశ్వర పుజారా, ఆకాశ్ చోప్రా కూడా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లకే మద్దతు తెలిపారు. ఇర్ఫాన్ పఠాన్ మాత్రం భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌తో పాటు పాకిస్తాన్ జట్టును సెమీఫైనల్‌కు వెళుతుందని అంచనా వేశాడు. ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్ అనూహ్య ప్రదర్శన చేయగల సామర్థ్యం కలిగి ఉండటమే ఇర్ఫాన్ ఎంపికకు కారణం.

మిస్టర్ ఐపీఎల్ సురేశ్ రైనా తన జాబితాలో భారత్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక జట్లను ఎంచుకున్నాడు. శ్రీలంకను సెమీఫైనల్ రేసులోకి తీసుకురావడం రైనా అంచనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక మహమ్మద్ కైఫ్, రాబిన్ ఉతప్పలు కూడా భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మొత్తంగా చూస్తే.. దాదాపు ప్రతి మాజీ ప్లేయర్ అంచనాల్లో భారత్ ఉండడం విశేషం. అలాగే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కూడా సెమీస్ చేరుకుంటాయని మాజీలు చెప్పారు. పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక వంటి జట్లు కూడా పోటీలో ఉన్నాయని మాజీలు అంచనా వేశారు. మాజీల అంచనాలు నిజమవుతాయా? లేదా టీ20 వరల్డ్‌కప్‌లో మరోసారి అనూహ్య ఫలితాలు కనిపిస్తాయా? అన్నది చూడాలి.

Tags:    

Similar News