T20 World Cup 2026 : సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న పాకిస్థాన్..మొహ్సిన్ నఖ్వీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న పాకిస్థాన్..మొహ్సిన్ నఖ్వీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. నిజానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం తమ జట్టును భారత్‌కు పంపబోమని ప్రకటించడంతో మొదలైన వివాదం, ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ముగిసిందనుకున్నారు. కానీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ రంగంలోకి దిగడంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. పాక్ జట్టు భారత్‌తో ఆడుతుందా లేదా అన్నది తమ ప్రభుత్వం నిర్ణయిస్తుందని ఆయన ప్రకటించారు. కేవలం భారత్‌తో జరిగే మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరించి, మిగతా దేశాలతో ఆడాలని పాక్ భావిస్తున్నట్లు పాకిస్థానీ మీడియా కోడై కూస్తోంది. ఈ నిర్ణయంపై జనవరి 30 లేదా ఫిబ్రవరి 2న పాక్ ప్రధాని తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే పాకిస్థాన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అది ఆ జట్టుకే తీరని నష్టం కలిగిస్తుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం..ప్రతి దేశం టోర్నీకి ముందే ఒక ఒప్పందం పై సంతకం చేయాలి. ఇందులో షెడ్యూల్, వేదికలకు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వాలి. ఇప్పుడు భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ చెబితే, అది ఒప్పంద ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనివల్ల ఐసీసీ పాకిస్థాన్‌ను టోర్నీ నుంచి పూర్తిగా బహిష్కరించడమే కాకుండా, భారీ జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఐసీసీ నుంచి పాకిస్థాన్‌కు ఏటా అందే సుమారు రూ.311 కోట్ల ఆదాయం కూడా ఆగిపోతుంది. ఇది పాక్ క్రికెట్ బోర్డు ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చుతుంది.
మరోవైపు ఈ ప్రభావం శ్రీలంక క్రికెట్ బోర్డుపై కూడా పడుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్-పాక్ మ్యాచ్‌ను కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే, ఇప్పటికే అమ్ముడైన టికెట్ ధరలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల శ్రీలంక బోర్డుకు రావాల్సిన భారీ ఆదాయం గాలిలో కలిసిపోతుంది. ఐసీసీకి కూడా స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్ల ద్వారా వచ్చే ఆదాయంలో భారీ కోత పడుతుంది. బీసీసీఐ వంటి ధనిక బోర్డులకు ఇది చిన్న విషయమే కావొచ్చు కానీ, ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌కు మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది. మరి మొండితనంతో ముందుకెళ్లి పాక్ క్రికెట్ భవిష్యత్తును పణంగా పెడతారో లేక వెనక్కి తగ్గుతారో వేచి చూడాలి.