IND vs NZ 3rd T20 : ఇది టీ20నా లేక పది ఓవర్ల మ్యాచ్‌నా? కివీస్‌ను ఆడుకున్న అభిషేక్ శర్మ

ఇది టీ20నా లేక పది ఓవర్ల మ్యాచ్‌నా? కివీస్‌ను ఆడుకున్న అభిషేక్ శర్మ

Update: 2026-01-26 00:29 GMT

IND vs NZ 3rd T20 : గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా వీరవిహారం చేసింది. అటు బౌలింగ్‌లో బుమ్రా పదునైన యార్కర్లు, ఇటు బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ సిక్సర్ల సునామీతో న్యూజిలాండ్ జట్టు కకావికలమైంది. కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-0తో భారత్ కైవసం చేసుకుంది. కివీస్ ఏ దశలోనూ భారత జట్టుకు పోటీ ఇవ్వలేకపోయింది.

గౌహతిలోని బార్సపరా స్టేడియంలో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా తన పాత ఫామ్‌ను కొనసాగిస్తూ కివీస్ బ్యాటర్లను వణికించాడు. బుమ్రా తన తొలి బంతికే టిమ్ సైఫర్ట్‌ను క్లీన్ బోల్డ్ చేసి అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చాడు. అతనికి తోడుగా హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. ఒక దశలో గ్లెన్ ఫిలిప్స్ (48), చాప్‌మన్ (32) పోరాడినా, స్పిన్నర్ రవి బిష్ణోయ్ వారిని పెవిలియన్ చేర్చడంతో కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో 153 పరుగులకే పరిమితమైంది. బుమ్రా 3 వికెట్లతో సత్తా చాటగా, పాండ్యా, బిష్ణోయ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

ఇక 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి బంతికే సంజూ శాంసన్ రూపంలో షాక్ తగిలింది. అయితే ఆ తర్వాతే అసలైన అసలు సినిమా మొదలైంది. క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అభిషేక్ శర్మ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 14 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. కివీస్ బౌలర్లు ఎక్కడ బంతి వేసినా అది బౌండరీ అవతలే పడింది. ఇషాన్ కిషన్ (28) అవుట్ అయినా, అభిషేక్ ఏమాత్రం తగ్గలేదు. అతనికి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తోడవ్వడంతో టీమిండియా విజయం నల్లేరుపై నడకలా సాగింది.

సూర్యకుమార్ యాదవ్ కూడా తన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. కేవలం 26 బంతుల్లోనే 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ 20 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరి మెరుపులతో భారత్ కేవలం 10 ఓవర్లలోనే (60 బంతులు) లక్ష్యాన్ని ఛేదించి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0తో భారత్ కైవసం చేసుకుంది. యువ ఆటగాళ్ల దూకుడు, బుమ్రా ఫిట్‌నెస్ టీమిండియా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Tags:    

Similar News