U19 World Cup : భారత్ వీర విహారం.. న్యూజిలాండ్‌పై 81 బంతుల్లోనే భారీ విజయం
భారత్ వీర విహారం.. న్యూజిలాండ్‌పై 81 బంతుల్లోనే భారీ విజయం
U19 World Cup : ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026లో టీమిండియా కుర్రాళ్లు మరోసారి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. గ్రూప్ స్టేజ్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని భారత బ్యాటర్లు కేవలం 81 బంతుల్లోనే ఊదేసి, తమ పవరేంటో ప్రపంచానికి చాటిచెప్పారు. కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల వర్షం కురిపించడంతో న్యూజిలాండ్ బౌలర్లు చేతులెత్తేశారు.
జింబాబ్వేలోని బులవాయో వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 37 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ఏమాత్రం తడబడకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై ఉన్న తేమను భారత బౌలర్లు అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా ఆర్‌ఎస్ అంబరీష్ నిప్పులు చెరిగే బంతులతో న్యూజిలాండ్ బ్యాటర్లను వణికించాడు. దీంతో కివీస్ జట్టు 36.2 ఓవర్లలో కేవలం 135 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలింగ్ విభాగంలో ఆర్‌ఎస్ అంబరీష్ 4 వికెట్లతో టాప్ లేపగా, హెనిల్ పటేల్ 3 వికెట్లతో అతనికి సహకరించాడు. కివీస్ జట్టులో కాలమ్ శామ్సన్ (37 నాటౌట్) ఒక్కడే పోరాడాడు. మిగిలిన వారంతా భారత పేస్, స్పిన్ ఉచ్చులో చిక్కుకొని పెవిలియన్‌కు క్యూ కట్టారు. మహమ్మద్ ఇనాన్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీసి కివీస్ స్కోరు బోర్డును కట్టడి చేశారు. రన్‌రేట్ పెరగకుండా వారు వేసిన పొదుపైన ఓవర్లు భారత్‌కు కలిసొచ్చాయి.
136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. టీ20 కంటే వేగంగా ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. ఓపెనర్ ఆరోన్ జార్జ్ (7) త్వరగానే అవుట్ అయినప్పటికీ, ఆ తర్వాతే అసలు విధ్వంసం మొదలైంది. వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే కలిసి కివీస్ బౌలర్లపై దండయాత్ర చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 39 బంతుల్లోనే 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను వన్ సైడ్ చేసేశారు. వైభవ్ 23 బంతుల్లో 40 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి అలరించాడు.
కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే అయితే సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 27 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లతో 53 పరుగులు సాధించి తన క్లాస్ చూపించాడు. వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత విహాన్ మల్హోత్రా (17 నాటౌట్), వేదాంత్ త్రివేది (13 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ కేవలం 13.3 ఓవర్లలోనే (అంటే 81 బంతుల్లో) లక్ష్యాన్ని ఛేదించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయంతో భారత యువ జట్టు సెమీస్ దిశగా బలమైన అడుగులు వేస్తోంది. అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేసిన అంబరీష్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.