T20 World Cup 2026:టీ20 వరల్డ్ కప్ 2026కు పాక్ గుడ్ బై? ఆ స్థానంలో వచ్చే కొత్త జట్టు ఇదే

టీ20 వరల్డ్ కప్ 2026కు పాక్ గుడ్ బై? ఆ స్థానంలో వచ్చే కొత్త జట్టు ఇదే

Update: 2026-01-25 02:40 GMT

 T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఐసీసీ విధానాలకు నిరసనగా బంగ్లాదేశ్ తప్పుకోగా, ఆ దేశానికి పాకిస్థాన్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఐసీసీ నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, బంగ్లాదేశ్‌ను తప్పించడం అన్యాయమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. ఒకవేళ బంగ్లాదేశ్ లేని టోర్నీలో తాము కూడా ఆడాలా వద్దా అనే అంశంపై పునరాలోచన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ విదేశీ పర్యటనలో ఉన్నారు, ఆయన రాగానే ఈ విషయంలో తుది నిర్ణయం వెలువడనుంది.

ఒకవేళ పాకిస్థాన్ అధికారికంగా టోర్నీ నుంచి వైదొలిగితే, ఆ ఖాళీని భర్తీ చేసేందుకు ఐసీసీ ర్యాంకింగ్స్‌ను ప్రాతిపదికగా తీసుకుంటుంది. నిబంధనల ప్రకారం.. తదుపరి మెరుగైన ర్యాంకులో ఉన్న ఉగాండా జట్టుకు ఈ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ ఖరారు చేసిన నేపథ్యంలో, పాక్ స్థానంలో ఉగాండా రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ స్పందిస్తూ.. లక్షకు పైగా కెపాసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్‌కు బదులుగా, భారత్-ఉగాండా మ్యాచ్ చూసే పరిస్థితి రావచ్చు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

మరోవైపు పీసీబీ ఒకవైపు బహిష్కరణ అని చెబుతూనే, మరోవైపు టోర్నీ కోసం సన్నాహాలు కూడా చేస్తోంది. ఇప్పటికే జట్టు ఎంపిక ప్రక్రియ మొదలైందని సమాచారం. ఐసీసీ లాంటి పెద్ద సంస్థతో పెట్టుకుంటే భవిష్యత్తులో వచ్చే ఆదాయంపై ప్రభావం పడుతుందని కొందరు బోర్డు సభ్యులు భయపడుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి బహిష్కరించండి అనే ఆదేశాలు వస్తే మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని నఖ్వీ తేల్చి చెప్పారు. పాక్ తప్పుకుంటే ఐసీసీకి వాణిజ్యపరంగా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే భారత్-పాక్ మ్యాచ్ అంటేనే భారీ ఆదాయం.

ఐసీసీ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే దేశాల పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చడం ద్వారా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ఇప్పుడు పాకిస్థాన్ విషయంలో కూడా ఐసీసీ ప్రత్యామ్నాయ జట్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 22వ జట్టుగా ఉగాండాను చేర్చడం ద్వారా టోర్నీని యథావిధిగా నిర్వహించాలని చూస్తోంది. రాబోయే 48 గంటల్లో పాక్ ప్రధాని ఇచ్చే నిర్ణయంపైనే ప్రపంచ క్రికెట్ అభిమానుల కళ్లు ఉన్నాయి.

Tags:    

Similar News