WPL 2026:డబ్ల్యూపీఎల్‌లో నైట్ సివర్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ అద్భుత విజయం
డబ్ల్యూపీఎల్‌లో నైట్ సివర్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ అద్భుత విజయం
WPL ౨౦౨౬ : మహిళల ప్రీమియర్ లీగ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మళ్లీ గాడిలో పడింది. వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై, కీలక సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఘనవిజయం సాధించి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వడోదర వేదికగా జరిగిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నైట్ సివర్ బ్రంట్ చారిత్రాత్మక సెంచరీతో చెలరేగగా, ఆర్‌సీబీ యువ సంచలనం రిచా ఘోష్ ఒంటరి పోరాటం అభిమానుల మనసు గెలుచుకుంది.
వడోదరలో జనవరి 26న జరిగిన ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్‌కు చాలా కీలకం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబైకి ఆరంభంలోనే ఎదురుదబ్బ తగిలినా, నైట్ సివర్ బ్రంట్ ఆకాశమే హద్దుగా చెలరేగింది. హెలీ మాథ్యూస్‌తో కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. మాథ్యూస్ 39 బంతుల్లో 56 పరుగులతో తన వంతు సహకారం అందించగా, సివర్ మాత్రం ఆర్‌సీబీ బౌలర్లపై కనికరం చూపలేదు. కేవలం 57 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 100 పరుగులు పూర్తి చేసింది. దీనితో డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ సాధించిన మొట్టమొదటి క్రీడాకారిణిగా ఆమె చరిత్ర సృష్టించింది. ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగుల భారీ స్కోరు సాధించింది.
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ముంబై బౌలర్ల ధాటికి కెప్టెన్ స్మృతి మంధాన సహా టాపార్డర్ మొత్తం కుప్పకూలింది. కేవలం 5.1 ఓవర్లలోనే 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఆర్‌సీబీ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానాలు కలిగాయి. హేలీ మాథ్యూస్ తన స్పిన్ మాయాజాలంతో బెంగళూరు బ్యాటింగ్ వెన్నుముకను విరిచింది.
మ్యాచ్ ఏకపక్షంగా ముగుస్తుందనుకున్న తరుణంలో రిచా ఘోష్ వీరవిహారం చేసింది. నడిన్ డిక్లర్క్ (28) సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన రిచా, ఆ తర్వాత గేర్ మార్చింది. ఆఖరిలో ముంబై బౌలర్లను ఫోర్లు, సిక్సర్లతో ఉతికి ఆరేసింది. ముఖ్యంగా 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ఆఖరి ఓవర్ దాకా తీసుకెళ్లింది. ఆఖరి ఓవర్లో 32 పరుగులు కావాల్సిన దశలో 16 పరుగులు రాబట్టినప్పటికీ విజయం మాత్రం దక్కలేదు. రిచా 50 బంతుల్లో 90 పరుగులు (10 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి ఔట్ అయింది. ఫలితంగా బెంగళూరు 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముంబై తరపున హేలీ మాథ్యూస్ 3 వికెట్లు, షబ్నిమ్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీశారు.
ముంబై ఇండియన్స్ ఈ విజయంతో ప్లేఆఫ్ రేసులో పట్టు బిగించింది. గతేడాది ఛాంపియన్లుగా ఉన్న ముంబై మళ్లీ పాత ఫామ్‌ను అందుకోవడం లీగ్‌లో ఉత్కంఠను పెంచింది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయిన ఆర్‌సీబీ, తమ మిడిల్ ఆర్డర్ వైఫల్యాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నైట్ సివర్ సాధించిన ఈ సెంచరీ రాబోయే మ్యాచ్‌ల్లో ఇతర ప్లేయర్లకు కూడా స్ఫూర్తిగా నిలవనుంది.