IPL 2025: ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు..సచిన్‌ను దాటేసిన రజత్  పటీదార్

IPL 2025: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ పెద్దగా రాణించలేకపోయాడు.

Update: 2025-04-19 05:32 GMT

IPL 2025: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ రజత్ పటీదార్ పెద్దగా రాణించలేకపోయాడు. నెమ్మదిగా ఆడిన అతను 18 బంతుల్లో కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సొంతగడ్డపై ఆర్‌సీబీ వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. అయితే, ఈ మ్యాచ్‌లో రజత్ పటీదార్ ఒక భారీ రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు, ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కూడా వెనక్కి నెట్టాడు. సచిన్ ఈ ఘనతను 31 ఇన్నింగ్స్‌ల్లో సాధించగా, పటీదార్ కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే పూర్తి చేశాడు. గుజరాత్ టైటాన్స్ ఆటగాడు సాయి సుదర్శన్ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను కేవలం 25 ఐపీఎల్ ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు సాధించాడు.

మొదటి భారత బ్యాటర్

ఐపీఎల్‌లో 1000 పరుగులు పూర్తి చేయడానికి రజత్ పటీదార్‌కు 15 పరుగులు మాత్రమే అవసరం. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసి ఈ ఘనతను అందుకున్నాడు. అంతేకాదు, మరో అరుదైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 1000 పరుగులు చేసిన ఆటగాళ్లలో 35 సగటు, 150 స్ట్రైక్ రేట్‌తో ఉన్న ఏకైక భారత బ్యాటర్ రజత్ పటీదార్. ఈ జాబితాలో క్రిస్ గేల్, డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసెన్, షిమ్రాన్ హెట్మెయర్, ట్రావిస్ హెడ్ వంటి కొద్దిమంది ఆటగాళ్లు మాత్రమే ఉన్నారు. అంతేకాదు, ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ఆర్‌సీబీ తరఫున 1000 పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా కూడా రికార్డు సృష్టించాడు. అతని కంటే ముందు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

ఆర్‌సీబీలో ఎంట్రీ ఇలా

రజత్ పటీదార్ 2022 సీజన్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో ఆర్‌సీబీలో చేరాడు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మూడేళ్లలో ఆర్‌సీబీలో కీలక ఆటగాడిగా ఎదిగి జట్టు పగ్గాలు చేపట్టాడు. అతని కెప్టెన్సీలో బెంగళూరు జట్టు ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. మొదటి 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలు సాధించింది. ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ఎన్నో ఏళ్ల రికార్డులను బద్దలు కొట్టింది. 17 ఏళ్ల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపై ఓడించింది. అయితే, సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో మాత్రం ఓటమి పాలైంది.

Tags:    

Similar News