Sanjita Chanu get Arjuna Award 2018: ఎట్టకేలకు రెండేళ్ల తర్వాత సంజిత చాను వరించిన అర్జున అవార్డు
Indian Weight lifter Sanjita Chanu: భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను ఎట్టకేలకు అర్జున అవార్డు వరించింది. 2018లో అందుకోవల్సిన అర్జున అవార్డును ఇప్పుడు ఆమె చెంత చేరనుంది.
భారత వెయిట్‌లిఫ్టర్ సంజిత చాను ఎట్టకేలకు అర్జున అవార్డు వరించింది. 2018లో అందుకోవల్సిన అర్జున అవార్డును ఇప్పుడు ఆమె చెంత చేరనుంది. 2017 నవంబర్‌లో అమెరికాలో జరిగిన ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌కు ముందు సంజీత చాను నుంచి సేకరించిన శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం వాడినట్లు యుఎస్ డోపింగ్ నిరోధక సంస్థ పరీక్షలో తేలింది. 'బి' శాంపిల్ కూడా పాజిటివ్‌గా రావడంతో 2018 మేలో ఆమెపై తాత్కాలిక నిషేధం విధించారు. ఆ తర్వాత ఆ నిషేధాన్ని రద్దు చేశారు. ఆ శాంపిల్‌కు రెండు నంబర్లు కేటాయించడంతో స్పష్టత కరవై ఆమెపై ఎలాంటి చర్యలు లేవని ప్రకటించారు.
అయితే 2016, 17 సంవత్సరాల్లో ఈ పురస్కారానికి సంజిత చాను దరఖాస్తు చేసుకున్నా పరిశీలనకు నోచుకోలేదు. 2017లో తన పేరు జాబితా నుంచి తొలగించడంపై ఢిల్లీ హైకోర్టులో సంజిత ఓ రిట్ పిటిషన్ వేశారు. తాజాగా ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఈ భారత లిఫ్టర్‌పై ఉన్న అన్ని డోపింగ్ నేరాలను ఎత్తేయడంతో.. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల అనుగుణంగా సంజితకు అర్జునను అందజేయనున్నట్లు క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు గురువారం తెలిపాయి. సంజితకు అర్జున అవార్డు ఖరారైందని త్వరలోనే అందజేస్తారని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి చెప్పారు. 2014, 2018 కామన్వెల్త్ క్రీడల్లో సంజిత స్వర్ణ పతకాలు సాధించారు.
డోపింగ్ వివాదం నుంచి బయటపడినందుకు సంచిత సంతోషం వ్యక్తం చేశారు. కానీ, శాంపిల్‌ను పరీక్షించే క్రమంలో జరిగిన పొరపాటుకు తను కోల్పోయిన అవకాశాల మాటేమిటని, తను అనుభవించిన మానసిక గాయాన్ని ఎవరు బాధ్యత వహిస్తారని సంచిత ప్రశ్నించారు.