Who is Cooper Connolly: ఐపీఎల్ అరంగేట్రంలోనే మేటి ఇన్నింగ్స్‌.. ఎవరీ సెన్సేషన్ కూపర్‌ కనోలీ!

Who is Cooper Connolly: చండీగఢ్‌లో మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌పై కూపర్‌ కనోలీ (72 నాటౌట్‌) సూపర్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో ఎవరీ సెన్సేషన్ కూపర్‌ కనోలీ క్రికెట్ ఫాన్స్ ఆరా తీస్తున్నారు.

Update: 2026-04-01 16:25 GMT

Who is Cooper Connolly: ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఎప్పటికప్పుడు అద్భుతమైన ఆటగాళ్లు పుట్టుకొస్తూనే ఉంటారు. ఎందరో ప్లేయర్స్ క్రికెట్ చరిత్రలో తమదైన ముద్ర వేశారు. 22 ఏళ్ల యువ సంచలనం కూపర్‌ కనోలీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం కనోలీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఇందుకు కారణం ఐపీఎల్ 2026. ఆస్ట్రేలియా క్రికెట్లో ఇప్పటికే బలమైన ముద్ర వేసిన ఈ కుర్రాడు.. ఐపీఎల్ 2026లో మెరిశాడు. సహచరులు పెవిలియన్ చేరుతున్న సమయంలో చివరి వరకు క్రీజులో నిలబడి.. మేటి ఇన్నింగ్స్‌తో పంజాబ్‌ కింగ్స్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. చండీగఢ్‌లో మంగళవారం గుజరాత్‌ టైటాన్స్‌పై (72 నాటౌట్‌; 44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులు) సూపర్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. దాంతో ఎవరీ సెన్సేషన్ కూపర్‌ కనోలీ క్రికెట్ ఫాన్స్ ఆరా తీస్తున్నారు.

ఆస్ట్రేలియా అండర్-19 జట్టు తరఫున తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన కూపర్‌ కనోలీ.. అనతి కాలంలోనే క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. దేశవాళీ క్రికెట్‌లో స్థిరమైన ప్రదర్శన కనబరుస్తూ.. బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) ద్వారా తనలోని అసలైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేశాడు. క్రికెట్ ఆస్ట్రేలియా అతడికి అవకాశం ఇవ్వగా.. అక్కడా నిరూపించుకున్నాడు. ఇప్పటికే ఆసీస్ తరఫున 11 టీ20లు, 8 వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్‌గా, లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా జట్టులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో కూపర్‌ కనోలీపై ఫ్రాంచైజీలు ప్రత్యేక ఆసక్తిని కనబరిచాయి. చివరికి పంజాబ్ కింగ్స్ రూ. 3 కోట్లు వెచ్చించి ఈ యువ ఆల్‌రౌండర్‌ను సొంతం చేసుకుంది. అయితే వేలంలో అంత భారీ ధర పలకడంపై అప్పట్లో కొన్ని సందేహాలు వ్యక్తమైనప్పటికీ.. కనోలీ తన బ్యాట్‌తోనే వాటన్నింటికీ సమాధానమిచ్చాడు. తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఒత్తిడిని అధిగమించి, అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పంజాబ్ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. కేవలం బ్యాటింగ్‌లోనే కాకుండా.. అవసరమైనప్పుడు తన స్పిన్ బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయగల సామర్థ్యం కనోలీ సొంతం.

అంతర్జాతీయ స్థాయిలో గణాంకాలు సాధారణంగా అనిపించినా.. కూపర్‌ కనోలీలోని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం అతడిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. బిగ్ బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ వంటి దిగ్గజ జట్ల తరఫున ఆడిన అనుభవం ఇక్కడ ఐపీఎల్‌లో అతడికి ఎంతగానో ఉపయోగపడుతోంది. పంజాబ్ కింగ్స్ యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. తొలి మ్యాచ్‌లోనే హీరోగా నిలిచాడు. రాబోయే మ్యాచుల్లో ఈ యువ ఆటగాడు మరింత కీలకం కానున్నాడు. ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఈ సీజన్ ముగిసేలోపు ఐపీఎల్ అభిమానుల గుండెల్లో కనోలీ చెరగని ముద్ర వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా క్రికెట్ భవిష్యత్ ఆశాకిరణంగా మారుతున్న కనోలీ ప్రయాణం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News