IND vs AUS : వరల్డ్ కప్‌లో టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా సంచనలం
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025లో భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది.
IND vs AUS : వరల్డ్ కప్‌లో టీమిండియాకు వరుసగా రెండో ఓటమి.. కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా సంచనలం
IND vs AUS : ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025లో భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. విశాఖపట్నంలో జరిగిన 13వ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా బలమైన ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ అద్భుతంగా రాణించి 330 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా, బౌలింగ్ విభాగం వైఫల్యం కారణంగా ఓటమి తప్పలేదు. ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో ఓటమి. దీంతో పాయింట్స్ టేబుల్‌లో భారత జట్టు మూడో స్థానానికి పడిపోయింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతికా రావల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 155 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. 66 బంతుల్లో 80 పరుగులు చేసి అవుట్ కాగా, ఈ ఇన్నింగ్స్‌లో ఆమె ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000 వన్డే పరుగులు పూర్తి చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. ప్రతికా రావల్ 75 పరుగులు చేసి వెనుదిరిగింది. ఆ తర్వాత, హర్మన్‌ప్రీత్ కౌర్ (22), హర్లీన్ డియోల్ (38) పరుగులు చేశారు. చివర్లో జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ కీలకమైన అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
జెమీమా, రిచా ఘోష్ ఐదో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా, చివర్లో భారత జట్టు తడబడింది. రిచా ఘోష్ (32), జెమీమా రోడ్రిగ్స్ (33) త్వరగా అవుట్ అయ్యారు. ముఖ్యంగా చివరి ఓవర్లలో ఆస్ట్రేలియా బౌలర్లు ఒత్తిడి పెంచడంతో భారత జట్టు 50 ఓవర్లు ఆడకుండానే ఆలౌట్ అయింది. అమన్‌జోత్ కౌర్ (16), దీప్తి శర్మ (1), క్రాంతి గౌడ్ (1) స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.
ఆస్ట్రేలియా తరఫున అనబెల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టగా, సోఫీ మోలినెక్స్ 3, మేగన్ షుట్, ఆష్లే గార్డ్‌నర్ తలో వికెట్ తీశారు. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ, ఫోబ్ లిచ్‌ఫీల్డ్ మెరుపు ఆరంభం ఇచ్చారు. వీరు కేవలం 11.2 ఓవర్లలోనే 85 పరుగులు జోడించారు. ముఖ్యంగా కెప్టెన్ అలీసా హీలీ అద్భుతంగా ఆడి కేవలం 84 బంతుల్లో తన ఆరో వన్డే సెంచరీని పూర్తి చేసింది.
మధ్యలో ఎలిస్ పెర్రీ గాయంతో రిటైర్ అవ్వడం, బెత్ మూనీ, సదర్లాండ్ త్వరగా అవుట్ అయినప్పటికీ, హీలీ వెనుకడుగు వేయలేదు. ఆమె, ఆష్లే గార్డ్‌నర్‌తో కలిసి 95 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయాన్ని ఖాయం చేసింది. దీంతో ఆస్ట్రేలియా ఒక ఓవర్ మిగిలి ఉండగానే 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.