IND vs ENG Semi Final 2026: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్‌ మ్యాచ్.. ఆసక్తిరేపుతున్న ఐసీసీ నాకౌట్ రికార్డ్స్!

IND vs ENG Semi Final 2026: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది.

Update: 2026-03-03 15:07 GMT

IND vs ENG Semi Final 2026: భారత్ vs ఇంగ్లాండ్ సెమీఫైనల్‌ మ్యాచ్.. ఆసక్తిరేపుతున్న ఐసీసీ నాకౌట్ రికార్డ్స్!

IND vs ENG Semi Final 2026: అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. బ్యాటర్లు, బౌలర్లు నువ్వా నేనా అన్నట్లు తలపడతారు. కొన్నిసార్లు మ్యాచ్ చివరి వరకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల నాకౌట్ మ్యాచ్‌లలో ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి అభిమానులు థ్రిల్‌కు గురవుతారు. ఇప్పుడు భారత్, ఇంగ్లాండ్ మధ్య 2026 టీ20 వరల్డ్ కప్ సెమీస్ జరగనుంది. వాంఖడే స్టేడియంలో రెండో సెమీఫైనల్‌ మ్యాచ్ మార్చి 5న రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ సెమీఫైనల్ నేపథ్యంలో గత ఐసీసీ నాకౌట్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఆసక్తికర గణాంకాలు ఉన్నాయి.

1983 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ విజయం భారత క్రికెట్ చరిత్రలో మైలురాయిగా నిలిచింది. అదే టోర్నీలో భారత్ తన తొలి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని.. ప్రపంచ క్రికెట్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. అయితే 1987 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ 35 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సమిష్టి ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో మళ్లీ భారత్ ఆధిపత్యం చాటింది. వర్షం ప్రభావితమైన ఆ మ్యాచ్‌లో ఉత్కంఠభరిత పోరులో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ ట్రోఫీ భారత్‌కు మరో గౌరవాన్ని తీసుకొచ్చింది. 2022 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఓపెనర్లు అద్భుత ప్రదర్శన చేసి భారత్‌కు గెలుపును అవకాశమే ఇవ్వలేదు. అయితే 2024 టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో భారత్ 68 పరుగుల భారీ తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది.

గణాంకాలు చూసుకుంటే.. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో భారత్, ఇంగ్లాండ్ జట్లు దాదాపు సమానంగా పోటీపడినట్లు స్పష్టమవుతోంది. కీలక దశల్లో ఒత్తిడిని తట్టుకుని మెరుగైన ప్రదర్శన చేసిన జట్టే విజయం సాధించింది. భారత్–ఇంగ్లాండ్ మధ్య నాకౌట్ పోరు అంటే క్రికెట్ అభిమానులకు ఎప్పుడూ ప్రత్యేక ఆకర్షణగానే ఉంటుంది. మరి 2026 టీ20 వరల్డ్ కప్ సెమీస్ మ్యాచ్‌లో ఏ టీమ్ విజయం సాధిస్తుందో చూడాలి. భారత్ గెలవాలని ఇండియా ఫాన్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News