IND vs ENG Semifinal : భారత్ సెమీస్ బెర్త్‎కు ఎసరు..ఇంగ్లాండ్‎లోని ఈ ఐదుగురు ముదుర్లతో జాగ్రత్త

భారత్ సెమీస్ బెర్త్‎కు ఎసరు..ఇంగ్లాండ్‎లోని ఈ ఐదుగురు ముదుర్లతో జాగ్రత్త

Update: 2026-03-03 01:58 GMT

IND vs ENG Semifinal : టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు వచ్చేసింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ పోరుకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదిక కానుంది. మార్చి 5, గురువారం రోజున జరిగే ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే సంజు శాంసన్ అదిరిపోయే ఫామ్‌తో టీమిండియా జోరు మీదున్నప్పటికీ, రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఇంగ్లాండ్‌ను తక్కువ అంచనా వేయలేం. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ అడుగడుగునా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ, కీలక సమయంలో ఎవరో ఒకరు మెరిసి జట్టును గట్టెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఐదుగురు ఇంగ్లీష్ ప్లేయర్లు భారత్ ఆశలపై నీళ్లు చల్లేందుకు సిద్ధంగా ఉన్నారు.

1. విల్ జాక్స్

ఈ టోర్నీలో ఇంగ్లాండ్ పాలిట వరప్రదాతగా మారాడు విల్ జాక్స్. కేవలం బ్యాటింగ్‌తోనే కాదు, బంతితోనూ అద్భుతాలు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో 176 స్ట్రైక్ రేట్‌తో 191 పరుగులు చేసి, మిడిల్ ఆర్డర్‌లో వెన్నెముకలా నిలిచాడు. బౌలింగ్‌లోనూ 7 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగుసార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్న జాక్స్, భారత్‌కు ప్రధాన ముప్పుగా మారనున్నాడు.

2. ఆదిల్ రషీద్

భారత బ్యాటర్లను తన గింగిరాలు తిరిగే బంతులతో ముప్పుతిప్పలు పెట్టడంలో ఆదిల్ రషీద్ సిద్ధహస్తుడు. టీమిండియాపై అతడికి ఉన్న రికార్డు సూర్య సేనను కలవరపెడుతోంది. 18 మ్యాచుల్లో 14 మంది కీలక భారత బ్యాటర్లను అవుట్ చేసిన రషీద్, ఈ వరల్డ్ కప్‌లోనూ 11 వికెట్లతో చెలరేగుతున్నాడు. కేవలం 7.50 ఎకానమీతో అత్యంత పొదుపుగా బౌలింగ్ చేస్తూ, పరుగుల వేగాన్ని నియంత్రించగలడు. అతడి గుగ్లీలను కనిపెట్టడంలో భారత బ్యాటర్లు విఫలమైతే సెమీస్ గండం తప్పదు.

3. సామ్ కరన్

సామ్ కరన్ అంటేనే స్మార్ట్ క్రికెట్. ఐపీఎల్ లో ఆడిన అపారమైన అనుభవం ఇతడికి భారత్ రోడ్ల మీద ఎక్కడ బంతులు వేయాలో బాగా తెలుసునని చెబుతోంది. డెత్ ఓవర్లలో యార్కర్లు వేయడం, స్లో బంతులతో బ్యాటర్లను బురిడీ కొట్టించడంలో ఇతను దిట్ట. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే, లోయర్ ఆర్డర్‌లో వచ్చి భారీ సిక్సర్లతో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగలడు. టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో సామ్ కరన్ వ్యూహాలు ప్రమాదకరంగా మారుతాయి.

4. ఫిల్ సాల్ట్

ఇంగ్లాండ్‌కు అదిరిపోయే ఆరంభం ఇవ్వడంలో ఫిల్ సాల్ట్ పాత్ర కీలకం. ఈ టోర్నీలో అతడు చేసిన పరుగులు 125 మాత్రమే కావొచ్చు, కానీ అతడు క్రీజులో ఉన్నంత సేపు స్కోరు బోర్డు పరుగులు పెడుతూనే ఉంటుంది. ఆరంభ ఓవర్లలోనే భారత బౌలర్లపై విరుచుకుపడి ఒత్తిడి పెంచడం ఇతడి ప్రధాన లక్ష్యం. సాల్ట్ ను పవర్‌ప్లేలోనే అడ్డుకోలేకపోతే, భారత్ భారీ స్కోరును ఎదుర్కోవాల్సి ఉంటుంది.

5. హ్యారీ బ్రూక్

ప్రస్తుత ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఒక కంప్లీట్ ప్యాకేజీ. స్పిన్ బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో బ్రూక్ దిట్ట. సూపర్-8లో పాకిస్థాన్‌పై సెంచరీ బాదిన తర్వాత అతడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది. స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లతో స్పిన్నర్ల లయను దెబ్బతీయడం ఇతడి స్టైల్. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న బ్రూక్, సెమీస్ వంటి పెద్ద మ్యాచ్‌లో కీలకంగా మారనున్నాడు.

Tags:    

Similar News