Harry Brook: ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ 'మందు' బాబు వేషాలు.. బౌన్సర్‌పై దాడి! ఈసీబీ భారీ పెనాల్టీ, షాకింగ్ వివరాలు..

ఇంగ్లాండ్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ మద్యం మత్తులో బౌన్సర్‌పై దాడి చేశాడు. ఈ ఘటనపై ఈసీబీ సీరియస్ అయి రూ. 36 లక్షల జరిమానా విధించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Update: 2026-01-09 09:08 GMT

క్రికెట్ మైదానంలో పరుగుల వరద పారించాల్సిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, పరిమిత ఓవర్ల కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) మైదానం బయట వివాదంలో చిక్కుకున్నాడు. మద్యం మత్తులో ఒక బౌన్సర్‌పై దాడి చేసినట్లు తేలడంతో ఇంగ్లాండ్ అండ్‌ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అసలేం జరిగింది?

యాషెస్ సిరీస్ (Ashes 2025-26) ప్రారంభానికి మూడు వారాల ముందు, నవంబర్ 1వ తేదీ రాత్రి న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్‌లో ఈ సంఘటన జరిగింది.

నైట్ అవుట్ రచ్చ: ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వన్డే సిరీస్ సందర్భంగా బ్రూక్ ఒక పబ్‌కు వెళ్లాడు. అక్కడ మద్యం మత్తులో ఒక బౌన్సర్‌తో గొడవకు దిగి, అతనిపై చేయి చేసుకున్నట్లు సమాచారం.

వైరల్ వీడియో: ఆ మరుసటి రోజు జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ కేవలం 6 పరుగులకే అవుట్ అయ్యాడు. అదే సమయంలో తన సహచర ఆటగాడు జాకబ్ బెథెల్‌తో కలిసి మద్యం తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదం ముదిరింది.

ఈసీబీ కొరడా.. రూ. 36 లక్షల జరిమానా!

ఈ క్రమశిక్షణారాహిత్యాన్ని ఈసీబీ తీవ్రంగా పరిగణించింది. అంతర్గత విచారణ జరిపిన బోర్డు, బ్రూక్‌కు £30,000 (సుమారు రూ. 36 లక్షలు) భారీ జరిమానా విధించింది. అంతేకాకుండా, ఇది 'ఫైనల్ వార్నింగ్' అని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతమైతే కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించింది.

క్షమాపణలు చెప్పిన కెప్టెన్:

తన తప్పును ఒప్పుకున్న హ్యారీ బ్రూక్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. "నా ప్రవర్తన తప్పు అని నేను అంగీకరిస్తున్నాను. ఇది నాకు మరియు ఇంగ్లాండ్ జట్టుకు ఇబ్బంది కలిగించింది. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా భావిస్తాను. నా సహచరులను, కోచ్‌లను, అభిమానులను నిరాశపరిచినందుకు చింతిస్తున్నాను" అని బ్రూక్ పేర్కొన్నాడు.

యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 0-5తో ఘోరంగా ఓడిపోవడం, ఆటగాళ్లు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడంపై ఇంగ్లీష్ మీడియా దుమ్మెత్తిపోస్తోంది.

Tags:    

Similar News