IND vs WI : ఈడెన్ గార్డెన్స్‌లో ఇద్దరిదీ సేమ్ టు సేమ్ రికార్డు.. మ్యాచ్ గెలిస్తే చాలు, సెమీస్ టికెట్ దక్కినట్టే

ఈడెన్ గార్డెన్స్‌లో ఇద్దరిదీ సేమ్ టు సేమ్ రికార్డు.. మ్యాచ్ గెలిస్తే చాలు, సెమీస్ టికెట్ దక్కినట్టే

Update: 2026-02-28 01:57 GMT

IND vs WI : కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ మైదానం ఎన్నో అద్భుతమైన పోరాటాలకు సాక్ష్యంగా నిలిచింది. ఇప్పుడు మరో హై-వోల్టేజ్ పోరుకు ఈ వేదిక సిద్ధమైంది. మార్చి 1వ తేదీన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 రౌండ్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసే జీవన్మరణ పోరాటం. గెలిచిన జట్టు నేరుగా సెమీస్‌లోకి అడుగుపెడుతుంది, ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. అయితే ఈ మ్యాచ్‌లో ఎవరి పక్షాన విజయం నిలుస్తుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఎందుకంటే ఈ మైదానంలో రెండు జట్లకూ ఒక వింతైన, అద్భుతమైన 100 శాతం రికార్డు ఉంది.

ముందుగా వెస్టిండీస్ రికార్డును గమనిస్తే.. ఈడెన్ గార్డెన్స్‌లో ఈ జట్టుకు టీ20 వరల్డ్ కప్‌లో ఓటమి అనేదే తెలియదు. ఇప్పటివరకు ఈ మైదానంలో వెస్టిండీస్ ఆడిన మూడు వరల్డ్ కప్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. అందులో ఒకటి ప్రస్తుత వరల్డ్ కప్‌లో సాధించిన విజయాలు కాగా, మరొకటి 2016 వరల్డ్ కప్ ఫైనల్. ఆ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి వెస్టిండీస్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ సెంటిమెంట్ విండీస్ ఆటగాళ్లలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. కోల్‌కతా పిచ్‌పై ఆ జట్టుకు ఉన్న పట్టు చూస్తుంటే టీమ్ ఇండియాకు కచ్చితంగా సవాల్ ఎదురయ్యేలా ఉంది.

మరోవైపు టీమిండియా రికార్డు కూడా తక్కువేమీ కాదు. ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టీ20 మ్యాచుల్లో భారత్ నాలుగింటిలోనూ గెలిచి క్లీన్ స్వీప్ రికార్డును కలిగి ఉంది. అంతేకాకుండా టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ మైదానంలో పాకిస్థాన్‌తో ఆడిన ఏకైక మ్యాచ్‌లోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. అంటే సంఖ్యాపరంగా చూస్తే ఇరు జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో అజేయమైన శక్తుల్లా కనిపిస్తున్నాయి. ఒకవైపు వరల్డ్ కప్ మ్యాచుల్లో విండీస్ అజేయంగా ఉంటే, మరోవైపు ఈ వేదికపై విండీస్ పై ఆడిన ద్వైపాక్షిక సిరీస్ మ్యాచుల్లో భారత్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.

ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జరగబోయే పోరులో ఎవరి రికార్డు బద్దలవుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తన తండ్రి మరణించినా జట్టు కోసం ఆడేందుకు అలీగఢ్ నుంచి తిరిగి వచ్చిన రింకూ సింగ్ వంటి వీరులు ఒకవైపు, విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగే వెస్టిండీస్ హిట్టర్లు మరోవైపు ఉండటంతో క్రికెట్ అభిమానులకు అసలైన విందు భోజనం గ్యారెంటీ. చరిత్రలో తొలిసారిగా ఈ రెండు జట్లు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కోసం ఈడెన్ గార్డెన్స్‌లో ఎదురుపడబోతున్నాయి. కాబట్టి ఎవరిదో ఒకరి రికార్డుకు మార్చి 1న ఫుల్ స్టాప్ పడటం ఖాయం. ఆ మూడున్నర గంటల ఆట టీమిండియా భవిష్యత్తును తేల్చేయబోతోంది.

Tags:    

Similar News