IND vs WI : ఈడెన్ గార్డెన్స్ లో అసలు సిసలు యుద్ధం..భారత్ వర్సెస్ విండీస్..గెలిచినోడిదే సెమీస్

ఈడెన్ గార్డెన్స్ లో అసలు సిసలు యుద్ధం..భారత్ వర్సెస్ విండీస్..గెలిచినోడిదే సెమీస్

Update: 2026-02-27 00:53 GMT

IND vs WI : టీ20 వరల్డ్ కప్ 2026 రసవత్తర మలుపులు తిరుగుతోంది. ముఖ్యంగా భారత్ ఉన్న గ్రూపులో సమీకరణాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ఒకరి గెలుపు మరొకరికి వరంగా మారుతుంటే, ఇంకొకరి ఓటమి వేరొకరికి శాపంగా పరిణమిస్తోంది. తాజాగా సౌతాఫ్రికా చేసిన సాయానికి భారత్ అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే సౌతాఫ్రికా పెట్టిన బాకీని టీమిండియా వడ్డీతో సహా చెల్లించేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రికా దర్జాగా సెమీస్ చేరగా, భారత్ తన సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

సౌతాఫ్రికా భారత్‌కు ఎలా మేలు చేసిందో తెలుసా?

వెస్టిండీస్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆఫ్రికా జట్టు 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచి ఉంటే భారత్ పరిస్థితి దారుణంగా ఉండేది. ఆఫ్రికా గెలవడమే కాకుండా, విండీస్ నెట్ రన్ రేట్‌ను బాగా తగ్గించేసింది. దీంతో భారత్‌కు సెమీస్ వెళ్లే దారి సుగమమైంది. ఆఫ్రికా చేసిన ఈ సాయానికి బదులుగా, భారత్ జింబాబ్వేను 72 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ ఫలితంతో ఇంగ్లాండ్ తర్వాత సెమీస్ చేరిన రెండో జట్టుగా సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. భారత్ తన బాకీని ఇలా తీర్చేసింది.

ఇక అసలు సిసలు యుద్ధం రాబోయే ఆదివారం జరగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య డూ ఆర్ డై మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌లో నెట్ రన్ రేట్‌తో పని లేదు, పాయింట్ల లెక్కలు అక్కర్లేదు. ఎవరు గెలిస్తే వారు నేరుగా సెమీఫైనల్‌కు వెళ్తారు, ఓడిన జట్టు ఇంటిదారి పడుతుంది. కరేబియన్ వీరులను ఎదుర్కోవడం సూర్యకుమార్ సేనకు అంత సులభం కాదు, కానీ సెమీస్ టికెట్ కావాలంటే విండీస్‌ను చిత్తు చేయాల్సిందే.

ఈ సూపర్ సండే రోజున కోల్‌కతాలో క్రికెట్ అభిమానులకు పండగే అని చెప్పాలి. అటు జింబాబ్వేపై గెలిచిన ఊపులో భారత్ ఉంటే, ఇటు సౌతాఫ్రికా చేతిలో ఓడి రగిలిపోతున్న వెస్టిండీస్ ఉంది. మరి ఈ ఆసక్తికర పోరులో పైచేయి ఎవరిదో చూడాలి. భారత బౌలర్లు ఫామ్ లో ఉండటం, హార్దిక్ పాండ్యా ఆల్ రౌండ్ షో అదరగొడుతుండటం టీమిండియాకు ప్లస్ పాయింట్. అటు విండీస్ హిట్టర్లను కట్టడి చేస్తే భారత్ సెమీస్ చేరడం ఖాయం.

Tags:    

Similar News