Abhishek Sharma : చెన్నైలో భారత్ పరుగుల వరద..వెరైటీ రికార్డ్ క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ
చెన్నైలో భారత్ పరుగుల వరద..వెరైటీ రికార్డ్ క్రియేట్ చేసిన అభిషేక్ శర్మ
Abhishek Sharma : టీ20 వరల్డ్ కప్ 2026లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు తన బ్యాట్‌కు పనిచెప్పాడు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అభిషేక్, జింబాబ్వేతో జరిగిన కీలకమైన సూపర్-8 పోరులో మెరిశాడు. చెన్నైలోని ఎం.ఏ. చిదంబరం స్టేడియం సాక్షిగా హాఫ్ సెంచరీతో చెలరేగి, ఫామ్ లోకి వచ్చానని చాటిచెప్పాడు. ఇది వరల్డ్ కప్ కెరీర్‌లో అభిషేక్‌కు మొట్టమొదటి ఫిఫ్టీ కావడం విశేషం. అయితే ఎప్పుడూ మెరుపు వేగంతో ఆడే అభిషేక్, ఈ మ్యాచ్‌లో తన శైలికి భిన్నంగా కాస్త నిదానంగా ఆడి టీ20 ఇంటర్నేషనల్ కెరీర్‌లో తన రెండో అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 26 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. గతంలో అతను 33 బంతుల్లో ఫిఫ్టీ చేసిన రికార్డు ఉంది. గత మూడు మ్యాచ్‌ల్లో కనీసం ఖాతా తెరవకుండానే డకౌట్ అయిన అభిషేక్, నాలుగో మ్యాచ్‌లో కేవలం 15 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. కానీ జింబాబ్వే బౌలర్ల ముందు మాత్రం ఆచితూచి ఆడుతూ సంయమనం పాటించాడు. మొదటి నుంచే విరుచుకుపడే అలవాటున్న అతను, ఈసారి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి జట్టుకు మంచి పునాది వేశాడు. మొత్తం 30 బంతులు ఎదుర్కొన్న అభిషేక్.. 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
భారత ఇన్నింగ్స్ విషయానికి వస్తే, టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. గతంలో నమోదైన 218 పరుగుల రికార్డును ఇది తుడిచిపెట్టేసింది. అంతేకాకుండా, వరల్డ్ కప్ చరిత్రలోనే ఇది రెండో అత్యధిక స్కోరు కావడం గమనార్హం. 2007లో కెన్యాపై శ్రీలంక చేసిన 260 పరుగుల రికార్డు తృటిలో తప్పిపోయింది. అభిషేక్ శర్మతో పాటు హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 50 నాటౌట్), యువ ప్లేయర్ తిలక్ వర్మ (16 బంతుల్లో 44 నాటౌట్) ధాటిగా ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది.
ముఖ్యంగా హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ టీమిండియాకు కొండంత బలాన్ని ఇచ్చింది. 4 సిక్సర్లు, 2 ఫోర్లతో చెలరేగిన హార్దిక్ జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. తిలక్ వర్మ కూడా కేవలం 16 బంతుల్లోనే 4 సిక్సర్లతో విరుచుకుపడి అభిమానులను అలరించాడు. మొత్తానికి అభిషేక్ శర్మ ఫామ్‌లోకి రావడం, మిగిలిన బ్యాటర్లు రాణించడం భారత అభిమానులకు ఊరటనిస్తోంది. సెమీస్ కు ముందు టీమిండియా బ్యాటర్లు ఇలా భీకర ఫామ్ లోకి రావడం ప్రత్యర్థి జట్లకు ఒక హెచ్చరిక లాంటిదే అని చెప్పాలి.