Cheteshwar Pujara : సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి.. అసలు కారణం పిచ్‌దేనా? పుజారా ఏమన్నారంటే!

సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. విజయం కోసం కేవలం 124 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ, భారత జట్టు 93 పరుగులకే చాపచుట్టేసింది.

Update: 2025-11-18 06:50 GMT

Cheteshwar Pujara : సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి.. అసలు కారణం పిచ్‌దేనా? పుజారా ఏమన్నారంటే!

Cheteshwar Pujara : సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. విజయం కోసం కేవలం 124 పరుగుల లక్ష్యం ఉన్నప్పటికీ, భారత జట్టు 93 పరుగులకే చాపచుట్టేసింది. ఈ అనూహ్య ఓటమిపై మాజీ క్రికెటర్లు అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ ఓటమిపై స్పందించిన భారత మాజీ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు టర్నింగ్ వికెట్లు కావాలంటే బ్యాట్స్‌మెన్లు తమ ఆట తీరును పూర్తిగా మార్చుకోవాలని ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. స్వదేశంలోనే ఓటమి పాలవడం వెనుక ఉన్న అసలు సమస్య ఏంటో ఆయన వివరంగా చెప్పారు.

సాధారణంగా స్వదేశంలో జరిగే టెస్ట్ మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ఓడిపోవడం చాలా అరుదు. సౌత్ ఆఫ్రికా చేతిలో 30 పరుగుల తేడాతో ఓటమి పాలైన తర్వాత, పుజారా ఈ విషయాన్ని ప్రస్తావించారు. "స్వదేశంలో పిచ్ మార్పుల వల్ల టీమ్ ఇండియా ఓడిపోతుందని నేను నమ్మను. ఇంగ్లాండ్‌లోనో, ఆస్ట్రేలియాలోనో ఓడిపోతే ఒప్పుకోవచ్చు, కానీ ఈ జట్టులో టాలెంట్ పుష్కలంగా ఉంది" అని పుజారా అన్నారు. "యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ వంటి వారి ఫస్ట్-క్లాస్ రికార్డులు అద్భుతంగా ఉన్నాయి. వాషింగ్టన్ సుందర్ కూడా ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇంత మంచి రికార్డులు ఉన్నా.. ఇంట్లో ఓడిపోతున్నామంటే ఎక్కడో ఏదో తేడా ఉంది" అని పుజారా జియోస్టార్‎కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు.

"ఒకవేళ మీరు ఈ మ్యాచ్‌ను మంచి వికెట్‌పై ఆడి ఉంటే, భారత్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉండేవి. కానీ ఇలాంటి పిచ్ లపై ఆడేటప్పుడు గెలిచే అవకాశాలు తగ్గుతాయి, ప్రత్యర్థి జట్టు కూడా మనకు సమానంగా పోటీ ఇవ్వగలదు. భారత్‌లో ఎంత టాలెంట్ ఉందంటే.. ఇండియా-ఏ జట్టు కూడా సౌత్ ఆఫ్రికాను ఓడించగలదు. అందుకే పిచ్ మార్పుల వల్ల ఓడిపోయామని చెబితే.. అది ఒప్పుకోదగినది కాదు" అని పుజారా గట్టిగా చెప్పారు.

ఈ ఓటమికి కేవలం బ్యాట్స్‌మెన్‌లను మాత్రమే నిందించలేమని పుజారా అభిప్రాయపడ్డారు. "అసమానమైన బౌన్స్, స్పిన్‌తో కూడిన ఇలాంటి వికెట్‌పై ఆడాలనుకుంటే, ప్రిపరేషన్ వేరేలా ఉండాలి. మనమే ఇలాంటి పిచ్ కావాలని అడిగామని గౌతీ భాయ్ (గౌతమ్ గంభీర్) చెప్పాడు. కానీ, ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత తేలిక కాదు" అని పుజారా వివరించారు. ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క బ్యాట్స్‌మెన్ మాత్రమే హాఫ్ సెంచరీ చేయగలిగాడంటే, అది మంచి పిచ్ కాదని అర్థమవుతోంది.

"ఒకవేళ టీమ్ ఇండియా ఇలాంటి టర్నింగ్ పిచ్ లు కోరుకుంటే, బ్యాట్స్‌మెన్‌లు ఖచ్చితంగా వేరే పద్ధతిలో ఆడటానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లు కనిపించలేదు. సాధారణంగా స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ ఉంటుందని వారు భావించి ఉండవచ్చు, కానీ ఇది ఆ పిచ్ కాదు. అందుకే, ఇలాంటి పిచ్‌లపై గెలవాలంటే బ్యాట్స్‌మెన్‌లు తమ స్ట్రాటజీని మార్చుకోవాలని పుజారా సూచించారు. ఈ ఓటమితో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 0-1 తేడాతో వెనుకబడింది. సిరీస్‌లో రెండో మ్యాచ్ నవంబర్ 22 నుంచి గువాహటిలో జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1 తో సమం చేయాలని టీమ్ ఇండియా పట్టుదలగా ఉంది.

Tags:    

Similar News