BCCI : క్రికెట్‌లో ఏజ్ ఫ్రాడ్‌కు బీసీసీఐ చెక్.. ఆటగాళ్ల వయసు కోసం కొత్త సిస్టమ్!
BCCI: భారత క్రికెట్‌లో ఏజ్ ఫ్రాడ్ కేసులు తరచుగా వెలుగులోకి వస్తుండటంతో బీసీసీఐ ఇప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకుంది.
BCCI : క్రికెట్‌లో ఏజ్ ఫ్రాడ్‌కు బీసీసీఐ చెక్.. ఆటగాళ్ల వయసు కోసం కొత్త సిస్టమ్!
BCCI: భారత క్రికెట్‌లో ఏజ్ ఫ్రాడ్ కేసులు తరచుగా వెలుగులోకి వస్తుండటంతో బీసీసీఐ ఇప్పుడు కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆటగాళ్ల నిజమైన వయసును గుర్తించడానికి ఒక ప్రొఫెషనల్ ఏజెన్సీని నియమించాలని నిర్ణయించుకుంది. ఈ కొత్త విధానం ప్రకారం, ఆటగాళ్ల వయసును రెండు దశల్లో ధృవీకరిస్తారు. దీనివల్ల ఏజ్ ఫ్రాడ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని బీసీసీఐ భావిస్తోంది.
రెండు దశల ఏజ్ వెరిఫికేషన్ సిస్టమ్
క్రికెట్ ప్లేయర్ల వయసు, ఇతర వివరాలను సరిచూడటానికి బీసీసీఐ ఇప్పుడు ఒక ఏజెన్సీని నియమించనుంది. బీసీసీఐ దీనికోసం టెండర్లను పిలిచింది. ఆగస్టు చివరి నాటికి ఈ ఏజెన్సీని నియమించే అవకాశం ఉంది. ఈ కొత్త వెరిఫికేషన్ సిస్టమ్ రెండు దశల్లో ఉంటుంది. మొదటగా ఆటగాళ్ల బర్త్ సర్టిఫికెట్లు, ఆధార్, పాస్‌పోర్ట్, ఓటరు గుర్తింపు కార్డు వంటి అన్ని రకాల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తర్వాత ట్యార్నర్ వైట్‌హౌస్ 3 లేదా టీడబ్ల్యు3 అనే ఎముక పరీక్ష ద్వారా ఆటగాడి వయసును నిర్ధారిస్తారు. ఈ పరీక్షలను ఎక్కువగా 16 ఏళ్ల లోపు అబ్బాయిలకు, 15 ఏళ్ల లోపు అమ్మాయిలకు నిర్వహిస్తారు. ఈ తనిఖీ ప్రక్రియ జులై, ఆగస్టు నెలల్లో జరుగుతుంది. ఒకవేళ ఏ ఆటగాడైనా ఈ తనిఖీల్లో మోసం చేసినట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
గతంలో కూడా చాలామంది ఆటగాళ్లు ఏజ్ ఫ్రాడ్ కేసుల్లో చిక్కుకున్నారు. 2015లో నితీష్ రాణా పుట్టిన తేదీలో వ్యత్యాసాలు ఉండటంతో, బీసీసీఐ ఢిల్లీకి చెందిన 22 మంది ఆటగాళ్లను నిషేధించింది. అందులో నితీష్ రాణా పేరు కూడా ఉంది. దీంతో అతన్ని వయసుల టోర్నమెంట్లలో ఆడకుండా నిషేధించారు. 2018లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో మంజ్యోత్ కల్రా కీలక సభ్యుడు. ఏజ్ ఫ్రాడ్ ఆరోపణల కారణంగా 2020లో అతనిపై రెండేళ్ల పాటు వయసుల క్రికెట్ నుండి, ఒక సంవత్సరం పాటు రంజీ ట్రోఫీ నుండి నిషేధం విధించారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాట్స్‌మెన్ వైభవ్ సూర్యవంశీ వయసుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. అయితే ఈ ఆరోపణలు నిరాధారమైనవని బీసీసీఐ స్పష్టం చేసింది.
కొత్త ఏజెన్సీని నియమించడానికి బీసీసీఐ కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. బిడ్ వేసే ఏజెన్సీలకు కార్పొరేట్ కంపెనీలు, విద్యా సంస్థలు వంటి పెద్ద సంస్థలకు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సేవలు అందించడంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి. ఏజెన్సీకి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఉండాలి. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో భౌతికంగా, డిజిటల్‌గా తనిఖీలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. అవసరమైతే గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్లి ఆటగాళ్ల వయసును పరిశీలించాలి. ఈ కొత్త నిబంధనల వల్ల భారత క్రికెట్‌లో ఏజ్ ఫ్రాడ్‌కు పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని బీసీసీఐ ఆశిస్తోంది.